ఆత్మవిశ్వాసమా.. అతివిశ్వాసమా!
డా. తిరునహరి శేషు :
* రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో బలమైన నాయకుడే. కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమని విస్మరించలేం. కానీ, రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలవదు, ఓడిపోదనే విషయాన్ని ఆయన గమనించాలి.
వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల తరచూ ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని ఘంటాపథంగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి వసంతంలో పార్టీ శ్రేణుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచడానికి 2034 వరకు కాంగ్రెస్సే అధికా రంలో ఉంటుందని చెప్పేవారు.
కానీ, రెండవ వసంతంలోనూ తాను ఒక జాతీయ పార్టీ ముఖ్యమంత్రిని అనే విషయాన్ని కూడా విస్మరించి ‘నాకు ఎవరు పోటీ లేర’ని బహిరంగంగా చెప్తుండటాన్ని చూస్తుంటే ఈ విషయంలో రెండు విషయాలు స్పష్టమవు తు న్నాయి. ఒకటి కాంగ్రెస్ అధినాయకత్వం బలహీనత, రెండవది అనతి కాలంలోనే కాంగ్రెస్‌పై పెరిగిన రేవంత్ పట్టు. ప్రజాస్వా మ్యంలో ఒక పార్టీ కాని, ఒక నాయకుడు కాని అధికారంలో ఉండాలా, వద్దా? అనేది ప్రజలు నిర్ణయిస్తారు.
కాబట్టి, ఏ నాయకుడై నా ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ప్రజా సేవలో ఉంటామని చెప్తుంటారు. కానీ, రేవంత్ లాంటి కొద్దిమంది నాయకులే ‘నేనే’ అనే వ్యాఖ్యలు చేస్తుంటారు (గతంలో ఎన్టీఆర్ కూడా). అయితే, రేవంత్ మాటల్లో ఆత్మవిశ్వాసం దాగి ఉన్నదా, లేదా అతివిశ్వా సం ఉన్నదా? అనేది ఎన్నికల్లో ప్రజలే నిర్ణ యిస్తారు.
ప్రామాణికత లేని థియరీ
రేవంత్ చెబుతున్న రాజకీయ థియరీకి సరైన రాజకీయ ప్రామాణికత లేదు. ఉమ్మ డి ఏపీలో 1994-2004 వరకు టీడీపీ, 2004-2014 వరకు కాంగ్రెస్ రెండు పర్యా యాలు ఉంటే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్ కూడా 2014-2023 వరకు రెం డు పర్యాయాలు అధికారంలో ఉంది కాబ ట్టి, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా ఉంటా నని రేవంత్ చెప్తున్నారు.
కానీ, 1999లో చంద్రబాబు రెండవసారి గెలిచారంటే వాజపేయిపై ప్రజల్లో ఏర్ప డిన సానుభూతి కారణం, 2009లో రాజశే ఖర్ రెడ్డి రెండవ పర్యాయం గెలిచారంటే మంచి పరిపాలన అందిం చటం, ప్రజారా జ్యం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్లనే, 2018లో కేసీఆర్ మళ్లీ గెలిచారంటే ముందస్తు ఎన్నిక లకు వెళ్లడం, కొత్త రాష్ర్టం కాబట్టి మరొక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావించటం కారణాలుగా తెలుస్తున్నాయి.
మరి రేవంత్ రెడ్డి రెండవ పర్యాయం గెలవడానికి గతం లో లాగా ఏ ప్రత్యేక అంశం దోహదప డుతుందో రాజకీయ విశ్లేషకుల అంచనా లకు కూడా అందటం లేదు. 2006లో జెడ్పీటీసీ స్థాయి నుంచి ఏకంగా ముఖ్య మంత్రిగా ఎదిగిన వ్యక్తికి సర్కార్ సంప్ర దాయాల మీద ఏర్పడదని, ప్రజల ఆశీస్సుల తో ఏర్పడుతుందనే విషయం తెలియనిది కాదు.
కానీ, రాజకీయంగా అటు పార్టీలో నూ, ఇటు రాష్ర్టంలోనూ తన పట్టుసడల కుండా చూసుకునే వ్యూహంలో భాగంగానే పదేపదే తానే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చెబుతున్నారు. గడచిన రెండు దశాబ్దాల్లో ఒక రాష్ర్టంలో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావటం ఒక్క రాజశేఖర్ రెడ్డికే సాధ్యమైంది.
౩ రాష్ట్రాల్లో మార్పునకే ఓటు
ఇటీవల ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో పాలక పక్షాలకి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేయ డంతో అధికారం కోల్పోక తప్పలేదు. బంగా ల్‌లో మమతాబెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, కేరళలో పినరాయి విజయన్ ప్రభు త్వాలు ప్రజారంజకమైన సంక్షేమ పథకాలు అమలు చేశాయి. ప్రజాపక్షపాత ప్రభు త్వాలు పేరుతెచ్చుకున్నాయి. అన్నిటికీ మిం చి రాజకీయంగా బలమైన నేతలుగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అయినా ప్రజలు మార్పుకి ఓటు వేయటం వల్ల ఎన్ని కల సమరాంగణంలో ఓటమిపాలవక తప్ప లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్‌లు మోదీ హవాను ఎదుర్కొని అద్భుత విజ యాలు సాధించారు. కానీ, శాసనసభ ఎన్ని కల నాటికి పరిస్థితి మారిపోయింది. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ఒక ఎంపీ మాత్రమే. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని తెలవని వాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నా రంటే అతిశయోక్తి కాదు.
‘మార్పు కావాలి’ అని ప్రజలు బలంగా విశ్వసించి, కాంగ్రెస్‌కి అధికారం కట్టబెట్టే సమయంలో రేవంత్ ఆ పార్టీకి నేతత్వం వహిస్తుండటంతో అన్ని కలి సొచ్చాయన్నది వాస్తవం. రాజకీయ వైకుం ఠపాళీలో నాయకుడికి ఆత్మవిశ్వాసం అవస రమే కానీ, అది అతివిశ్వాసంగా మారితే ప్రతికూల ఫలితాలు వస్తాయని 2024 ఏపీ ఎన్నికలు నిరూపించాయి.
‘వై నాట్ 175’ అన్న పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందని స్థాయిలో ఓడిపోవడం మన కళ్ల ముందే చూశాం. రేవంత్ గెలుపు ధీమాలో సంప్రదాయాన్ని నమ్ముకున్నట్లుగా కనపడు తోంది కానీ, ప్రజలను, పాలనను నమ్ముకు న్నట్లుగా కనిపించడం లేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రేవంత్ మాటల్లో గెలుపుపై ఆత్మవిశ్వాసం కంటే అతివిశ్వాసం పాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పాలన ఇలాగే ఉంటే కష్టమే
తెలంగాణ ఏర్పాటైన ఒక దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. పాలనా పగ్గాలు చేపట్టిన ఈ 30 నెలల కాలంలో గ్యారెంటీలను, డిక్లరేషన్లను, ఎన్నికల హామీలను సంతృప్తికర స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల పాలనలో అద్భుతాలు ఏమి కనిపించడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు బలమైన పోరా టాలు చేయకపోయినా కాంగ్రెస్ ప్రభు త్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందనే ఛాయలు కనపడుతున్నాయి.
గత పాలకు లపై అసంతృప్తి, రేవంత్ రెడ్డి నాయకత్వం, సునీల్ కనుగోలు ఎన్నికల వ్యూహాలు, 6 గ్యారెంటీలు కలిసి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ని విజయ తీరాలకి చేర్చాయి. తెలంగాణ ప్రజ లు మార్పు కావాలని భావించినప్పుడు వారికి కాంగ్రెస్ తప్ప మరొక ప్రత్యామ్నా యం కనిపించలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడు పర్యాయాలు జరిగిన శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మాత్రమే అధికారం కోసం పోటీపడ్డాయి.
కానీ, రాబో యే శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజ లలో ఏర్పడుతున్న ప్రజా వ్యతిరేకతను తట్టు కొని, బలమైన బీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాజ్యా ధికార పార్టీ, తెలంగాణ రక్షణ సేన లాంటి పార్టీలను ఎదుర్కొని మళ్లీ అధికా రంలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలహీ నపడ టం, రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలు, బలహీనవర్గాల్లో అధికార పార్టీ పై అసంతృప్తి పెరగటం భవిష్యత్తులో కాం గ్రెస్‌కు ప్రతికూలంగా మారవచ్చు.
జాతీయ రాజకీయ పరిణామాల దృష్ట్యా దళితులు, మైనార్టీలు కాంగ్రెస్‌కి బలమైన ఓటుబ్యాం కుగా నిలబడటంతో ఆ పార్టీ ఇప్పటికీ కొంత బలంగానే కనపడుతోంది. నిస్సందేహంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో బలమైన నాయ కుడే. కాంగ్రెస్ గెలుపులో రేవంత్‌రెడ్డి నాయ కత్వ పటిమని విస్మరిం చలేం. కానీ, రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలవదు, ఓడిపోదనే వి షయాన్ని ఆయన గమనించాలి.
రేవంత్ రెడ్డి వల్లనే కేరళలో కాంగ్రెస్ గెలిచిందని అను చరులు చేసిన అత్యుత్సాహం భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా నష్టం చేసే అవకా శం ఉంది. ఒక కేంద్రమంత్రి కుమారుడి ఫోక్సో కేసు విషయంలో ప్రభుత్వం, అధి కార పార్టీ వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌కు భవిష్య త్తులో రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఫోక్సో కేసు తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటే అని అధికార పార్టీ చేసిన ఆరోపణలకు బలం లేకుండా పోవటమే కాదు, ఈ కేసు బీఆర్
ఎస్‌కు రాజకీయంగా కలిసివచ్చింది. 2023 లో కాంగ్రెస్ గెలుపుకి ఉన్న అనుకూలతలు రాబోయే ఎన్నికల్లో ఉండకపోవచ్చు. అన్ని అనుకూలతలు ఉన్నా ప్రజలు 2023లో కాంగ్రెస్‌కు భారీ విజయాన్ని ఏమీ కట్టబె ట్టలేదనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి విశ్వాసంగా చెప్తున్న మాటల్లో అతి విశ్వాసమే ఎక్కువగా కనబడుతోందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
వ్యాసకర్త సెల్: 9885465877






