9 August, 2026 | 5:54 PM

కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

26-05-2024 01:43 AM

జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. శనివారం బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ భవనంలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఏఆర్‌ఓలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రొనాల్డ్‌రాస్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.

సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి హాల్‌లో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్‌పై ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారని స్పష్టం చేశారు.

కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించబోమన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియను వివరించారు. కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జాయింట్ సీఈఓ, అడిషనల్ కమిషనర్(యూబీడీ) జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సునంద రాణి, ఏఆర్‌ఓలు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.