6 May, 2026 | 12:29 AM

అమరుల మరణం కలచివేసింది!

09-03-2025 01:10 AM

‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఉద్యమించా. ఈ క్రమంలో చదువును కూడా పక్కనపెట్టా. ప్రతినిత్యం రోడ్లపై నిరసన కార్యక్రమాలతో హోరెత్తించి ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నా’ అని అన్నాడు జహీరాబాద్‌లో విద్యార్థి సంఘం నాయకుడు సీఎం అశోక్‌రెడ్డి. ఆనాటి మలిదశ ఉద్యమ జ్ఞాపకాలను ‘విజయక్రాంతి’కి వివరించారిలా.. 

మాది జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామం. రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాం. ఉద్యమంలో భాగమైనందుకు నాపై దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. అయితే జహీరాబాద్ కర్ణాటకాకు సరిహద్దులో ఉంటుంది. అయినా కూడా నావంతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించా. అయితే ఇక్కడ ఉద్యమం అంటేనే తెలియని పరిస్థితి. జహీరాబాద్ ఎమ్మెల్యేగా అప్పుటి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ గీతారెడ్డి ఉన్నారు.

ఉద్యమ ఉద్యమంలో గీతారెడ్డి పర్యటించినప్పుడల్లా మాలాంటివాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకునేవారు. ఈక్రమంలో చదువుకు దూరం కావాల్సివచ్చింది. రాష్ట్ర ఏర్పాటు కోసం సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపా. దాంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తిండి లేక స్టేషన్‌లోనే ఎన్నో ఇబ్బందులు పడ్డాను. తోటి ఉద్యమకారులే సద్దిమూట తీసుకొచ్చి ఆకలి తీర్చిన సందర్భాలున్నాయి. రాష్ట్ర కమిటీ ఇచ్చిన ప్రతి పిలుపునూ టీఆర్‌ఎస్వీ నాయకుడిగా విజయవంతం చేశా.

కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యమకారులను కలుపుకొనిపోయి జహీరాబాద్‌లో ‘జై తెలంగాణ’ నినాదం గట్టిగా వినిపించా. అయితే రాష్ట్ర సాధన కోసం మా ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అత్మబలిదానం చేసుకున్నారు. ఆ ఇద్దరి మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. వారి స్ఫూర్తితోనే జహీరాబాద్‌లో ప్రత్యేకంగా దీక్షలు చేశా. 

 గౌని దౌలయ్య, సంగారెడ్డి, (విజయక్రాంతి)

రాజకీయ నాయకులకు, ఉద్యమకారులకు తేడా అదే

రాజకీయ ఎత్తుగడలు, నాయకుల స్వార్థం కారణంగా ప్రత్యేక తెలంగాణ ఆలస్యమైంది. అప్పట్లో నాయకత్వం పెట్టుబడిదా రులు, భూస్వాముల ఆధీనంలో ఉండేది. తమ భూములు, ఆస్తులను కాపాడుకోవడానికి ప్రత్యేక తెలంగాణకు అడ్డుపడ్డారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా 1969 ఘటనలే చోటుచేసుకున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ శక్తులు అనైతికంగా జతకూడి రాష్ట్ర ఆకాంక్ష ఆలస్యం చేశారు. స్వార్థపూరితమైన నాయకత్వం వల్లే రాష్ట్ర ఏర్పాటు మరింత ఆలస్యమైంది. ఆనాడు నేను తెలంగాణ కోసమే రాజీనామా చేశాను. కాని మలిదశ ఉద్యమంలో ప్రధాన పార్టీల నాయకులు ప్రజల ఒత్తిళ్లకు భయపడి మాత్రమే రాజీనామాలు చేశారు. ఉద్యమకారులు, రాజకీయ నాయకుల ఆలోచనల్లో చాలా తేడాలుండేవి.  

- కొండాలక్ష్మణ్ బాపూజీ