5 May, 2026 | 11:08 PM

ఉద్యమ కుటుంబం

09-03-2025 01:05 AM

కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఉద్యమంలో పాల్గొనడం సాధారణ విషయం. కాని తండ్రితో పాటు పిల్లలు, భార్య సైతం ‘జై తెలంగాణ’ అంటూ పిడికిలి బిగించి ఉద్యమానికి ఊతమిచ్చారు. పాల్వంచ పట్టణానికి చెందిన ఎండీ మంజూర్ కుటుంబం ప్రత్యేక ఉద్యమంలో భాగమై ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. 

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీకి చెంది న ఎండీ మంజూర్ కుటుంబమంతా ఉద్యమానికే అంకితమైంది. ఉద్యమసమయంలో కుటుంబ సభ్యులపై అనేక కేసులు నమోదైనా వెనుకాడకుండా ముందుకు సాగారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే కల్పించాలనే లక్ష్యంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇంటి యజమాని మంజూర్ సహా భార్య నసి మా, కుమారులు మసూద్, ఆజిల్, హసీబ్‌లు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. ‘కేంద్ర, రాష్ట్రమంత్రు ల పర్యటనలు అడ్డుకోవడం, నిరహారదీక్షలు చేపట్టడం లాంటివెన్నో చేశాం. ఈ క్రమంలో నా కుమారుడు మసూద్ ఓ కేసులో 14రోజులు జైలు జీవితం గడిపాడు. ఆరు సంవత్సరాల తర్వాత కేసు కొట్టేశారు. జైలులోనూ రాష్ట్ర సాధన కోసం తొమ్మిది రోజులు పాటు నిరాహార దీక్ష చేశాడు” అని గుర్తు చేసుకున్నాడు మంజూర్.  

కలసికట్టుగా ఉద్యమించాం

నిరసన కార్యక్రమాలు ఎక్కడా జరిగినా కుటుంబమంతా పాల్గొన్నాం. సకల జనుల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ సిద్ధించింది తప్పా ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యమ పార్టీలు సైతం ఫక్తు రాజకీయ పార్టీలుగా మారాయి. ఇది ఎంతో బాధించింది. ఉద్యమ కుటుంబం అనే పేరు మిగిలింది తప్ప ప్రభుత్వపరంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. తెలంగాణలో పూర్తి స్థాయిలో నీళ్లు, నిధులు, నియామకాలు అమలు జరిగినప్పుడే ఉద్యమానికి సార్ధకత లభించినట్టవుతుంది.  

- ఎండీ మంజూర్, పాల్వంచ