28 February, 2026 | 6:07 AM

ఆపద్బాంధవుడు శిష్యుడే!

28-02-2026 12:00 AM

అది కరోనా సమయం. దేశవిదేశాల్లోనూ కరోనా కరాళనృత్యం చే స్తుంది. కరోనా బారినపడి ఎందరు అసువులు బాసారో లెక్కలేదు. కవులు, కళాకా రులు, శాస్త్రవేత్తలు వీరు వారనకుండా కరో నా ఆగడానికి బలైనవారే. అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అక్కడ మా అమ్మా యి ‘ఇండియాకు పోవద్దు నాన్నా’ అం టుంది. ఇండియాలో నా కుమారులు ‘రావొద్దు నాన్నా’ అంటున్నారు. అమెరికాలో ఎట్లున్నానో అట్లే ఉండాలని వాళ్ల అభిప్రా యం. జీవితంలో ఎవరికీ జైలు జీవితం కలగవద్దు. కరోనా ఎంతో మందిని ఖైదీల ను చేసింది.

పరమాణువు కనిపించనట్లే,  తాను కూడా ఎవరికీ కనిపించకుండా బా ధపెడుతుంది. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. కరోనా ఎవరి ఆజ్ఞ చేత మ నుష్యుల ప్రాణాలు తీస్తుందో!. ‘న న్ను ఇం డియాకు పంపించమని’ అమ్మాయినీ, అ ల్లుడినీ ప్రాధేయపడ్డాను. వారు అందుకు అంగీకరించలేదు. ‘విమానాలు లేవు. మళ్లీ మొదలైన తర్వాత పోదురులెండి’ అని భ రోసా ఇచ్చారు. లోగడ మూడుసార్లు అ మెరికా వచ్చాను. అప్పుడు నా అర్ధాంగి ప్ర మీల తోడుగా ఉంది. భార్య తో డుంటే భ ర్తకు బాధలుండవు.  కాని స్వస్థలానికి రావడానికి కష్టమైంది.

అందరూ బిజీ..

అతికష్టం మీద ‘వందే భారత్’లో ఇండియాకు రావడానికి టికెట్ దొరికింది. డబు ల్ ఛార్జి అయినప్పటికీ భయపడలేదు. నే ను ఇండియాకు రావడం ఎవరికీ ఇష్టం లే దు. నాకు మాత్రం అమెరికాలో ఉండడం కష్టమైంది. అమెరికాలో అమ్మాయి ఇంట్లో ఎంతసేపని టీవీ ముందు కూర్చోగలను? మాట్లాడుదామంటే ‘ఇంటి నుంచి పనిచేసుకోమని’ కంపెనీలు ఆదేశించాయి. అ మ్మాయి, అల్లుడు ఇంట్లో ఉండే ఆఫీసు ప నులు చేస్తున్నారు. పనుల్లో బిజీ అవడం తో మాటలు కరవయ్యాయి. నాకు చాలా బోరుగా ఉండింది. ఇద్దరు మనవరాళ్లున్నా వారికి ప్రత్యేకమైన గదులు, ప్రత్యేకమైన ఏర్పాట్లు!. భోజనం సమయంలో మాత్ర మే అందరినీ దర్శనం చేసుకోవచ్చు.

లేకపోతే, ఎవరెప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారో తెలియదు ఆ భగవంతునికి కూ డా. అతికష్టం మీద శాన్‌ప్రాన్సిస్కో నుంచి బయలుదేరే విమానంలో హైదరాబాదుకు చేరుకున్నాను. అదృష్టవశాత్తు ఇక్కడ హోమ్ క్వారంటైన్ నడుస్తుంది. నా ఇంట్లో నేనొక్కడినే కనుక నాకు ప్రత్యేకమైన వసతి అవసరం లేదు. సతి లేనివానికి వసతి గు రించి చింత ఏం ఉంటుంది? అక్కడ అ మ్మాయి శ్రావణి ఇంట్లో భోజనానికి ఇబ్బంది లేదు.

కానీ కరోనా తిననిస్తేనా? భ యంభయంగా ఆర్నెళ్లు గడపాల్సి వచ్చిం ది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది. కాలనీలో అందరూ భయపడుతున్నారు. ‘కరోనా ఎక్కడ  తీసుకొని వచ్చాడోనని’ గుసగుసలు పోయినవాళ్లు కూడా ఉన్నారు. పరమేశ్వరుని దయవల్ల అన్నిచోట్లా కరోనా టెస్టుల్లో నెగిటివ్ రావడం వల్ల బతికిపోయాను. కాని ఉప్పల్‌లో స్వగృహంలోకి ప్రవేశించిన తర్వాత కష్టాలు ఎదురయ్యాయి. 

సాయిబాబాను మరువను..

పరమేశ్వరుని దయ ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. ఇంటి నుంచి బయ టకు వెళ్లే అవకాశం లేదు. మరి నాకు భో జనం, మందులు తెచ్చి ఇచ్చేవారు ఎవ రు? అయితే ఈ సమయంలో నాకు ఎ లాంటి ఇబ్బంది కలగకుండా నెలపాటు చూసుకున్న సాయిబాబాను ఎన్నడూ మరవజాలను. మనిషి ఎంత గట్టివాడైనా ఒంటరిగా ఉండలేడు. నా పరిస్థితి బాధాకరమైంది. అయినా కరోనా నుంచి రక్షింప బడడానికి భగవంతుడే కారణం. నేను ఆధ్యాత్మికంగా ప్రవచనాలిస్తున్నవాణ్ణి. ఉ స్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం బోధించినా, పదవి విరమణ చేసిన తర్వాత వేదాది శాస్త్ర గ్రంథాలతో, దర్శన గ్రంథాలతో పరిచయం సాధించి ఎంతో మందికి బోధించాను.

వారిలో సా యిబాబా ఒకరు. వారి ఇంటి పేరు జానుమద్ది. దైవభక్తి గల కుటుంబం వారిది. వారికి బాల్యంలోనే పీఠాధిపతుల అనుగ్రహం లభించింది. ఆంగ్ల విద్యనభ్యసించ డంతో టెలికాం రంగంలో ఏ.జి.ఎమ్ స్థా యికి ఎదిగారు. వారికి ఉపనిషత్తులు చదవాలన్న కోరిక ఉంది. వారెంతో మందిని సంప్రదించగా, నా జాడ వారికి తెలిసింది. కరోనా కంటే ముందు వారొక రోజు మా ఇంటికి వచ్చి ‘నేను మల్కాజిగిరిలో ఉంటాను. మీరు ఉపనిషత్తులు బోధిస్తానని చెబి తే ఉప్పల్‌కు మకాం మారుస్తాను’ అన్నా రు. నాకు ఊపనిషత్తులు చెప్పడమంటే చాలా ఇష్టం. వారితో మీ ఇష్టం అన్నాను. 

హైదరాబాదు అల్లకల్లోలం..

సనాతనధర్మం పట్ల, విద్యపట్ల శ్రద్ధ కలిగినవారు కనుక మల్కాజిగిరి నుంచి ఉప్ప ల్‌కు మారారు. ప్రతిరోజు నియమవ్రతులై నా దగ్గరికి వచ్చి తైత్తిరీయోపనిషత్తు చదివించుకొని అర్థం చెప్పించుకునేవారు. శం కరులు గ్రహించిన ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనే వ్యాక్యం తైత్తిరీయోపనిషత్తులోనిదే. ము ఖ్యంగా ఈ ఉపనిషత్తు గురుశిష్యుల అనుబంధాన్ని తెలియజేస్తుంది. విద్యకు పూర్వ రూపం గురువైతే, ఉత్తరరూపం శిష్యుడని ఈ ఉపనిషత్తు చెబుతుంది. సాయిబాబా నాకు ముఖ్యశిష్యులయ్యారు.

అమెరికా నుంచి ఎప్పుడు వస్తానా? అని ఎదురుచూస్తున్నారు. మరొక ఉపనిషత్తును నా దగ్గర చదివించుకోవాలని వారి కోరిక. ఆ యన కోరికనో, లేక ఈశ్వరానుగ్రహమో కానీ కరోనా విజృంభణ తగ్గకముందే భా రతదేశంలో అడుగుపెట్టాను. హైదరాబా దు అల్లకల్లోలంగా ఉంది. నేను మా ఇం ట్లో ఒక్కడినే. అదృష్టవశాత్తు మా సాయిబాబా ప్రతిరోజు నాకు కావాల్సిన మందు లు తెచ్చి ఇచ్చేవారు. నా పిల్లలకు కూడా అంత ధైర్యం లేదు. కాని సాయిబాబా నా కోసం ప్రతిరోజు వచ్చేవారు. ‘విద్యాదదాతి వినయం’ అన్నారు. కాని ‘విద్యాదదాతి ధై ర్యం’ అని నేనంటాను. పాఠం కోసం ఏ వి ధంగా ప్రతిరోజు ఇంటికి వచ్చేవారో, అదే విధంగా నా బాగోగులు చూసుకునేవారు.

గొప్ప శిష్యుడు..

నేను ఉత్తమ గురువులకు ఉత్తమ శిష్యుడిని అని చెప్పుకోవడానికి, నాకు శిష్యుడైన సాయిబాబా ఒక ఉదాహరణ. అతడు బ్రా హ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కు లాతీతంగా వ్యవహరించేవారు. ధర్మబద్ధంగా వ్యవహరించడమే జీవితమైంది. వి ద్యనార్జించే సందర్భంలో శిష్యునికి విద్య మీద దృష్టి ఉండాలిగాని, గురువు కులగోత్రాల గురించి విచారించవలసిన పనిలేదు. ఇప్పటికీ సాయిబాబా నన్ను ఎంతో అభిమానిస్తాడు. నాతో ఆధ్యాత్మిక విషయాల ను చర్చిస్తాడు. సత్యాన్ని తెలుసుకొని ఆ నందిస్తాడు. గురువుగా సంబోధిస్తాడు. కరోనాకు ముందు, కరోనా తర్వాత నన్ను ఎంతో గౌరవించే సాయిబాబ అంటే నాకెంతో అభిమానం. రోజు తప్పించి రోజు ఆయనతో ఫోన్లో మాట్లాడకపోతే నాకు మనసొప్పదు. వారానికొకసారైన వారిని ప్రత్యక్షంగా చూడకపోతే ఏదో పోగొట్టుకున్నట్లనిపిస్తుంది.

- వ్యాసకర్త సెల్: 9885654381

ఆచార్య మసన చెన్నప్ప