విద్యారంగంలో మార్పులు సాధ్యమా?
డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్ రూమ్‌ల గురించి నివేదిక గొప్పగా చెప్పినప్పటికీ తెలంగాణలోని మారుమూల గ్రామాల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. నేటికీ అనేక పాఠశాలల్లో నిరంతర విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యం కలగానే ఉంది. డిజిటల్ పరికరాలు ఒక సాధనంగా మాత్రమే పనికివస్తాయి తప్ప ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేవు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డికి విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక కేవలం పరిపాలనా ప త్రం కాదు. విద్యార్థుల భవిష్యత్తును, రాష్ట్ర ప్రగతి పథాన్ని నిర్దేశించే దిక్సూచి. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా విద్యే మూలస్తంభం. విద్యలో నాణ్యత ఉంటేనే సామాజిక స మానత్వం,ఆర్థిక పురోగతి, సాంఘిక న్యా యం, విలువల పరిరక్షణ సాధ్యమవుతాయి. ఈ నేపథ్యంలో ఆకునూరి మురళి నే తృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ఆశలను రేకెత్తిస్తున్నప్పటికీ, దాని సారాంశం, అమలు, సాధ్యత, దీర్ఘకాల ప్రభావంపై సమగ్ర ప్రణాళిక అవసరం.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మౌలిక వసతుల కల్ప నపై కమిషన్ చూపిన చొరవ అభినందనీ యం. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం తగ్గిపోవడం ఒక చే దు వాస్తవం. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వ పాఠశాలలను నాణ్యత పరంగా బలోపేతం చేయడం అత్యంత అవసరం. ఫీజు నియంత్రణకు చట్టబద్ధమైన కమిటీని వేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చని భావించడం సానుకూల అంశమే. అయినా ప్రైవేటు సంస్థలన్నీ రాజకీయ నాయకులవే కాబట్టి ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి.
ప్రభుత్వ పాఠశాలలను, ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా తీర్చిదిద్దే ప్రతిపాదన, బడ్జెట్‌లో 18 శాతం విద్యకు కేటాయింపు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని సూచించడం విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం పాఠశాలల మౌలిక వసతులు తరగతి గదులు, మరుగుదొడ్లు, డిజిటల్ సదుపాయాలు మెరుగుపరచడం ఉన్నత విద్యలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం.. ఈ సూచనలు విద్యను కేవలం పరీక్షల పరిమితిలో కాకుండా, సమగ్ర వ్యక్తిత్వ వికాసా నికి ఉపయోగపడేలా మారుస్తాయి. సదుపాయాలు వంటి మౌలిక వసతులను మె రుగుపరచడం ద్వారా విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచవచ్చని కమిషన్ సూచించడం అభినంద నీయం.
ఆర్థిక వనరులు..
కానీ నివేదిక అమలు వెనుక అనేక చి క్కుముడులున్నాయి. ఈ సూచనలను అ మలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఎంత మేర అందుబాటులో ఉంటా యన్నది ప్రధాన ప్రశ్న. కమిషన్ సూచించినట్లుగా మౌలిక వసతుల అభివృద్ధి, ఉ పాధ్యాయ నియామకాలు, విద్యా సంస్కరణలు అమలు చేయడానికి ప్రభుత్వానికి స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక అవసరం. గతం లో కమిషన్లు నివేదికలు సమర్పించినప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదనే వాస్తవం ప్రజల్లో సందేహాలను కలిగిస్తోం ది.
నివేదికలు కాగితాలకే పరిమితమైతే అవి విద్యార్థుల జీవితాలను మార్చలేవు. కొద్ది సమయంలో అన్ని పాఠశాలలను అత్యున్నత ప్రమాణాలకు తీసుకెళ్లడం ఒక ఆదర్శవంతమైన లక్ష్యమే అయినప్పటికీ, అది దశల వారీ ప్రణాళిక ద్వారా మాత్ర మే సాధ్యమవుతుంది. ఉపాధ్యాయులపై అదనపు బాధ్యతలను మోపడం కంటే, వారికి తగిన శిక్షణ, ప్రోత్సాహం, వనరుల ను అందించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
విద్యా వ్యవస్థలో మా ర్పులు ఒక్కరోజులో సాధ్యమయ్యేవి కావు. అవి క్రమంగా, స్థిరంగా, బాధ్యతాయుతంగా అమలు చేయాల్సిన ప్రక్రియ. నిరు పేదలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూళ్ల ఏర్పాటు సహా కనీ స వసతులపై దృష్టి సారించడం అవస రం. డిజిటల్ విద్యా విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతి కతలను పాఠ్యాంశాల్లో చేర్చాలనే ప్రతిపాదన తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌లో నిల బెట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఈ భౌతిక హంగులు కేవలం పైపైన మెరుగులు దిద్దడానికే పరిమితం కాకూడదు. ఈ నివేదిక లో మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఉపాధ్యాయ శిక్షణపై ప్రత్యేక దృష్టి అవసరం. నాణ్యమైన ఉపాధ్యాయులే నాణ్యమైన విద్యకు పునాది. అలాగే డిజిటల్ విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలి. విద్యార్థులలో నైతిక విలువలు, రాజ్యాంగ భావాలు, మరియు సా మాజిక బాధ్యతను పెంపొందించే విధంగా పాఠ్యాంశాలను రూపొందించడం కూడా అత్యంత అవసరం.
అనారోగ్య పోటీ..
కేవలం కొన్ని గణాంకాలు లేదా మా ర్కుల ఆధారంగా ఉపాధ్యాయుని పనితీరును అంచనా వేయడం మంచిది కాదు. ఇది ఉపాధ్యాయుల మధ్య అనారోగ్యకరమైన పోటీని పెంచి వారి వృత్తిపరమైన గౌరవాన్ని దెబ్బతీసే అవకాశముంది. ఉ పాధ్యాయుడిపై బోధనేతర పరిపాలనా బాధ్యతలను పెంచడం వల్ల వాళ్లు అసలు లక్ష్యమైన బోధన నుంచి తప్పుకోవాల్సి వ స్తోందని కమిషన్ గుర్తించకపోవడం బా ధాకరం. ఇది విద్యా నాణ్యతను పెంచడా న్ని పోయి తగ్గించే ప్రమాదముంది. మా తృభాషలో బోధన అనే అంశాన్ని ఈ నివేదిక విస్మరించడం మరో ప్రధాన లోపం.
ప్రపంచవ్యాప్త పరిశోధనల ప్రకారం మా తృభాషలో విద్యనభ్యసించిన పిల్లల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంపై మోజులో పడి మాతృభాషను విస్మరించడమంటే మన సాంస్కృతిక మూలాలను మనమే తెంచుకోవడమవుతుంది. తెలంగాణ వంటి గొప్ప భాషా సంపద ఉన్న రాష్ట్రంలో తెలుగు మధ్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆం గ్లాన్ని ఒక భాషగా నేర్పించడం వేరు, ఆం గ్లాన్నే బోధనా మాధ్యమంగా మార్చి మా తృభాషను కనుమరుగు చేయడం వేరు.
ఈ విషయంలో కమిషన్ పునరాలోచన చే యాలి. ప్రాధమిక స్థాయిలో ప్రభుత్వ, ప్రై వేట్‌లలో తెలుగు మాద్యమంలోనే భోధన జరిగేలా కఠిన నియమాలు ఉంటే బాగుంటుంది. పాఠశాల స్థాయిలో కమిషన్ వృత్తి విద్య, వ్యాయామ విద్య అవసరాన్ని గు ర్తించలేదు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య మానసిక సంఘర్షణ విలువల పతనం గురించి ప్రస్థావించలేదు.
తోటి విద్యార్థులతో పోలికలు, తల్లిదండ్రుల అంచనాలు విద్యార్థిని మానసికంగా కుంగదీస్తున్నా యి. సోషల్ మీడియా ప్రపంచంలో ఉం టూ నిజ జీవితంలోని భావోద్వేగాలను పంచుకోలేకపోతున్నారు. విద్యార్థి దశలోనే సరైన మార్గదర్శకత్వం ఉంటేనే వా రు రేపటి ఉత్తమ పౌరులుగా ఎదుగుతా రు. విద్యార్థులకు మానసిక కౌన్సిలర్ అవసరాన్ని సూచించలేదు.
డ్రాపౌట్స్‌కు అవకాశం..
డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్ రూమ్‌ల గు రించి నివేదిక గొప్పగా చెప్పినప్పటికీ తెలంగాణలోని మారుమూల గ్రామాల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. నేటికీ అనేక పాఠశాలల్లో నిరంతర విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యం కలగానే ఉంది. డిజిటల్ పరికరాలు ఒక సాధనంగా మాత్రమే పనికివస్తాయి తప్ప ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేవు. సాంకేతిక త మీద పెట్టే పెట్టుబడిని ఉపాధ్యాయ ని యామకాలపై, వారి నైపుణ్యాల పెంపుపై పెడితే ఫలితం ఉంటుంది.
విద్యార్థుల సం ఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా గ్రామీణ పేద విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను విద్యకు దూరం చేసే ప్రమాదముంది. పాఠశాల విద్యార్థికి అందుబాటులో ఉం డాలి తప్ప, విద్యార్థి పాఠశాల కోసం మైళ్ల దూరం ప్రయాణించకూడదు. ఈ నివేదికలోని 45 శాతం పాస్ మార్కుల నిబంధన నాణ్యతను పెంచడానికి ఉద్దేశించినదే అయినా, క్షేత్రస్థాయిలో ఇది డ్రాపౌట్స్ పెరగడానికి కారణమవ్వొచ్చు.
విద్యార్థుల పై ఒత్తిడిని పెంచే బదులు అభ్యాస ప్రక్రియను సరళతరం చేయాలి. ఎప్‌సెట్ వం టి ఎంట్రన్స్ పరీక్షలను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలనే సూచన విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగించేదే. తల్లి దండ్రులకు కోచింగ్ పేరుతో ఖర్చు తగ్గించడం మంచిదే అయి తే ఇది విద్యా ప్రమాణాలను ఎంత మేర ప్రభావం చేస్తుందో చూడాలి.
వ్యాసకర్త సెల్: 8466827118
దుప్పటి మొగిలి




