దిక్సూచిలా రామన్ ఎఫెక్ట్ !
నేడు జాతీయ సైన్స్ దినోత్సవం
‘నా మతం సైన్స్, నేను సైన్స్‌నే పూజిస్తాను, ప్రేమిస్తాను.. నా బతుకు మొత్తం సైన్సే’ అన్న మహానుభావుడు సీవీ రామన్. భౌతిక శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించిన సీవీ రామన్ తన ‘రామన్ ఎఫెక్ట్’ పరిశోధన ద్వారా1930 డిసెంబరులో నోబెల్ బహుమతి అందుకున్నారు. రామన్ తన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నది.
1907లో ఉద్యోగరీత్యా రామన్ కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ, బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించ లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి రామన్ తన పరిశోధనలు కొనసాగించారు.
అయితే రామన్ తల్లి పార్వతి అమ్మాల్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండే ది. ఆమె వీణను అద్భుతంగా వా యించేవారు. అందుకే సీవీ రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాలపై సాగాయి. 1921లో లండ న్‌లో తను అధ్యయనం చేసిన సంగీ త పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ తర్వాత రామన్ తన పరిశోధనలను శబ్దశాస్త్రం నుంచి కాంతిశాస్త్రం వైపు మళ్లించారు.
అయితే తన తిరుగు ప్రయాణం సందర్భంగా ఓడలో ప్రయాణిస్తున్నప్పు డు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచనలో పడేసింది. సముద్రపు నీలి రంగుకు కారణం.. ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదన్న విషయం రామన్‌కు అర్థమైంది. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే దీనికి కారణమని ఊహించారు. కలకత్తా చేరుకున్న వెంటనే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఈ విషయంలో సీవీ రామన్‌కు యువ శాస్త్రవేత్తలు కె.ఆర్.రామనాథన్, కె.యస్ .కృష్ణన్‌లు అండగా నిలిచారు. 1927 డిసెంబర్‌లో కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని తెలుసుకున్న రామన్ ఆలోచనలో పడ్డారు.
కాంప్టన్ ఫలితం ఎక్స్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయంలోనూ నిజం కావాలని భావించారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు పునాది వేసింది. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని, పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకోవడానే రామన్ ఎఫెక్ట్‌గా అభివర్ణించారు. 1928 ఫిబ్రవరి 28న తొలిసారి రామన్ ఎఫెక్టును ప్రపంచానికి పరిచయం చేశారు. 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో రామన్ ఎఫెక్ట్‌ను వెలికి తీయడం అద్భుతమైన విషయమని ప్రపంచ శాస్త్రవేత్తలు అభినందించారు.
కామిడి సతీష్, జయశంకర్ భూపాలపల్లి




