16-02-2026 12:00:00 AM
సముద్రం ఎప్పుడూ రెండు ముఖాలు కలిగి ఉంటుంది. దూరాన ఉన్నప్పుడు నీలి రంగు శాంతిని ఇస్తుంది. అలలను ఎగవేస్తూ భయపెడుతూ ఉంటుంది. ఇక లోపలికి దిగితే మాత్రం గాఢాంధకారం. ఆ చీకటి దాటితే మళ్లీ అపారమైన ప్రశాంతత. లోపల రంగురంగుల జీవరాశులు. సరిగ్గా గూండ్ల వెంకట నారాయణ ‘ద్రావిడ మహా సముద్రం’ కవితా సంకలనం ఇలాంటి సముద్రమే. కానీ. ఇక్కడ నీళ్లు లేవు. ఉన్నది ఒక జాతి రక్తం.
ఆ జాతి తాలూకు జ్ఞాపకాలు, గాయాలు, అస్తిత్వ పోరాటం. ఇది సాధారణ సముద్రం కాదు. ద్రావిడ మహా సముద్రం. మొదటి కవిత నుంచే సంకలనం ప్రశ్నలను సంధిస్తుంది. మొదటి ప్రశ్న.. ‘చరిత్రను ఎందుకు మరిచావు?’ అని. వేల సంవత్సరాలుగా సాగుతున్న బ్రాహ్మణీకరణ యంత్రాంగం, సిందూలోయ నాగరికత నుంచి కుమరిక్కండం వరకు, కీలడి నుంచి చోళ, చేర, పాండ్య, చాళుక్య, రాజవంశాల వరకు విస్తరించిన ఒక అపారమైన సాగర తీర నాగరికతను ఒక్కసారిగా ఆర్యేతర అని మూలన పడేసిన చరిత్ర. సంస్కృత గ్రంథాల్లో ద్రావిడులను రాక్షసులు, అసురులు,
మ్లేచ్ఛులు అని రాసి, వాళ్ల దేవతలను రాక్షసులుగా మార్చి, వాళ్ల భాషలను పైసాచిక అని ముద్రవేసి, చివరికి చరిత్ర పుటల నుంచి పూర్తిగా తుడిచివేసిన కుట్ర ఇది. కవి ఆ సముద్రంలో అణువణువునూ పరిశీలిస్తాడు. అడవి, అరుణం, మిన్ను, నలుపు.. ఈ నాలుగు రంగులు ద్రావిడ భూమి.. గుండె చప్పుడు! అడవి అంటే జీవం, ఎరుపు అంటే రక్తం, మిన్ను అంటే ఆకాశం, నలుపు అంటే మట్టి. ఈ నాలుగూ కలిసిన ప్రకృతిని మొదట బ్రాహ్మణీకరణ ధ్వంసం చేసింది. తర్వాత బ్రిటిష్ వలస. ఇప్పుడు కార్పొరేట్ దోపిడీ. వేదాంత, జిందాల్, అదానీ, అంబానీ అనే పేర్లు మారినా దోపిడీ రంగు మారలేదు.
ఎరుపే. ఒడిశా డాంకల్ అడవుల్లో ఆదివాసీల రక్తం, కేరళ కాసర్‌గోడ్ ఎండోసల్ఫాన్ బాధిత పిల్లల రక్తం, తమిళనాడు కావేరి డెల్టా రైతుల రక్తం.. ఇవన్నీ ఒకే సముద్రంలో కలుస్తున్నాయి. చరిత్ర నడకలో దారి మైసమ్మ లాంటి దేవుళ్లు ఎందరో. మురుగన్, కోట్టవి, మారియమ్మన్, ఎల్లమ్మ, గంగమ్మ, పోచమ్మ, దుర్గమ్మ, ముత్యాలమ్మ చెప్పులు వేసుకోని, బంగారు కిరీటాలు పెట్టుకోని, కానీ.. భూమితో అవినాభావ సంబంధం కలిగిన దేవతలు.
వాళ్లను గ్రామ దేవతలు అని చిన్నచూపు చూసి, వాళ్ల పూజలను జంగమ పూజ అని అవమానించి, చివరికి బ్రాహ్మణ దేవాలయాల్లో అమ్మవారుగా ఒడిసి పెట్టిన చరిత్రను చూస్తున్నాం. ఈ పుస్తకం కేవలం గతాన్ని తవ్వి చూపించడం మాత్రమే కాదు.. ఇప్పటి పోరాటాన్నీ గుర్తు చేస్తుంది. ప్రతి ఉద్యమం, అడవుల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పోరాటం, కేరళలో ప్లాచిమడ ఆదివాసీలు, తమిళనాడు స్టెర్లైట్ పోరాటం, కర్ణాటకలో నంది కొండల రక్షణ, ఆంధ్రాలో బాక్సైట్ గనులకు వ్యతిరేకంగా తెగలవారు ఈ రోజుల్లోనూ ఎరుపు ఇంకా పారుతూనే ఉంది.
కానీ.. ఆ ఎరుపులోనే మళ్లీ ఒక కొత్త పంట పుట్టబోతోందని కవి నమ్మకంగా చెబుతాడు. లెక్కకు దొరకకుండా చేసినవి ఎన్నో మనం గుర్తుచేసుకోవాలి. అవును.. లెక్కల్లో లేని ఆ గుర్తులు.. ఈ కవితలు చదివిన తర్వాత మీరు మళ్లీ ఇక్కడ రెండు చరిత్రలు ఉన్నాయని గుర్తుచేసుకుంటారు. ఒకటి రాసిన చరిత్ర. మరొకటి తుడిచివేసిన చరిత్ర. ‘ద్రావిడ మహా సముద్రం’ ఆ తుడిచివేయబడిన చరిత్రను మళ్లీ నీటి పైకి తెస్తుంది చదవండి. ఎందుకంటే మరచిపోయిన సముద్రం మళ్లీ ఒడ్డుకు వస్తోంది.
ప్రతులకు: మట్టి ముద్రణల
Baaluagnivesh@gmail.com