16-02-2026 12:00:00 AM
మిట్టపల్లి సురేందర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పేరు ఒక సంచలనం. ఆయన రాసిన ‘రాతిబొమ్మల్లో కొలువైన శివుడు’ అనే పాట ప్రతిఒక్కరి కంట కన్నీరు పెట్టించింది. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ సాంస్కృతిక వైభవాలను చాటిచెప్పేందుకు ఆయన కలం జీవనదిగా సాగుతూనేఉంది. ఆయన ఒక్కో పాట స్వచ్ఛంగా ఉండటమే కాదు.. ఆ సాహిత్యంలో ఎవరికివారు, తమను సరిపోల్చుకునే విధంగా ఉంటుంది.
భావుకత నర్భగర్భంగా ఒదిగి ఉంటుంది. ఒకటా రెండా.. ఆయన రాసిన పాటలు ఎన్నెన్నో.. ‘తల్లీ నా వెలిశాల’ అంటూ ఆయన విప్లవ స్వప్నాలను జనంపై కుమ్మరించారు. ‘పచ్చిపాల వెన్నెలా నేలను పారబోసినట్లు పూసేనే గునుగు పూల తోటలు.. ఎంతటీ అందాల మహరాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే’ అంటూ ప్రేమధారలు పొంగించారు. ‘తెలంగాణలో పుట్టి.. తెలంగాణలో పెరిగి.. లోకమంతా తిరిగేవట’ అంటూ.. ‘అల్లిపూలు.. అందాల రవికలట..
తామరలే.. నీ తనువు చీరలట..’ అంటూ.. బతుకమ్మ కీర్తిపతాకాన్ని దశ దిశలా రెపరెపలాడించారు. ‘నవ మాసాలు మోసిన తల్లి’, ‘కాలిగజ్జె ఘల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో..అమ్మలారా.. అక్కలారా’ అంటూ జనంలోకి మిట్టపల్లి పాట వెళ్లిన తీరు గురించి చెప్పాలంటే ఈ ఒక్క పాట చాలు.. ప్రతి ఒక్కరూ ఆ పాటను ఆదరించారు.
‘తినగ తినగ వగరు తీపియని వేమన చెప్పెను’, ‘అరె సింగిడిలో రంగులను తీసుకొచ్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి’, ‘ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెను తంగెడు కొమ్మ’ వంటి పాటలు సాహిత్య ప్రపంచంలోనే కాదు జన బాహుళ్యంలో పాపులర్. ‘జననీ జననీ జై తెలంగాణ’ పాట తెలంగాణ ఉద్యమసమయంలో ఉర్రూతలూగించిన సందర్భం.. ‘బహుజన సంకల్పమా.. నిరుపేదల సౌధమా..తలపైన కిరీటమున్న సామాన్యుడి నేస్తమా’ అంటూ ఓ నేతపై మిట్టపల్లి రాసిన పాట ప్రజాదరణ పొందింది.
ఒక్కో పాట.. ఒక సాహితీ పరిమళం..
ఇటీవల విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చి్రత్రానికి సింగిల్ కార్డు సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్. చిత్రంలో అన్ని పాటలు ఒక ఎత్తు.. ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనె’ అన్న పాట ఒక ఎత్తు. చిత్ర కథను మిట్టపల్లి సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని పాట రాశారు.‘చావులో కూడా బతకడం ప్రేమికులకే తెలుసు’ అంటూ మరో పాటలో కథ ఆత్మను చక్కగా ఒకే వాక్యంలో వివరించారు.
‘కూడుకుంటూన్నది కొత్త పెళ్లి జంట’ అనే పాటలో తెలంగాణ మాండలికపు మట్టి వాసనను ఘనంగా పరిచయం చేశారు. ‘నాగులో నాగులా’ అంటూ డ్యాన్సులు చేసే కుర్రాళ్ల సంబురాన్ని ఆవిష్కరించారు. శ్రవణానందం కలిగేలా.. ‘ఎకరం పెట్టు పొక్కిలి’ చేస్తామంటూ .. పెళ్లి బరాత్ సందడిని చాటిచెప్పారు. బతుకమ్మ మీద రాసిన ‘అలా అలా’ అనే పాటలో ‘ఆ మేఘం వీడి వస్తున్న చినుకులను..
ఓ క్షణమైనా ఆపగలదా నింగి ఆగమని’,‘తేనె కంటె తియ్యంగా, అడవి కంటే అందంగా, కోయిలమ్మ పాడేటి పాటను ఆపగలదా అడవి.. పూలలో పుడుతూనే.. గాలిలో కలిసేటి.. పరిమళం తనలో దాచుకోగలదా తోట..’ అలా.. అలా నేను, నువ్వు ఒక్కటయ్యే రోజే వస్తే.. నిన్ను ఆపే అంతా బలం.. దేవుళ్లకైనా లేదంటా.. కథలోని సందర్భాన్ని ప్రకృతిలోని ప్రేమ గుణాన్ని జోడించి.. వివరించారు.
ప్రధాన స్రవంతియైనా సినిమా ల్లో మట్టి కవి మిట్టపల్లి సురేందర్.. ఆయన పాటలు మరిన్ని రావాలని.. తెలంగాణ లోకల్ మాటలు గ్లోబల్ ట్రెండ్ కావాలని, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో రాసినట్లు, ఆయన సింగిల్ కార్డు గేయరచయితగా పాటలు రాయాలని ఆకాంక్షిస్తున్నాం.