పట్టణ పేదలకు సొంతింటి కల నిజం..
నేడు ‘ఇందిరమ్మ ఇళ్లు.. ఎస్‌ఐజీ హౌసింగ్ టవర్స్’ షురూ
రంగారెడ్డి, జులై (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు పట్టణాల్లోని నిరుపేదలు, అల్పాదాయ వర్గాల సొంతింటి కల సాకారం చేసేందుకు సిద్ధమైంది. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారుల కోసం ’ఇందిరమ్మ ఇళ్లు ఎస్‌ఐజీ హౌసింగ్ టవర్స్’ పథకాన్ని ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రారంభించనుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. నగరాలు, పట్టణాల్లోని తక్కువ ఆదాయ వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా, అన్ని ఆధునిక వసతులతో కూడిన అపార్ట్మెంట్ తరహా బహుళ అంతస్తుల గృహాలను (హౌసింగ్ టవర్స్ ) ప్రభుత్వం నిర్మించనుంది.
ఆధునిక గృహ సముదాయాలు..
మురికివాడలు, ఇరుకు అద్దె ఇళ్లలో నివసిస్తున్న పట్టణ పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అన్ని సౌకర్యాలతో కూ డిన ఫ్లాట్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా, అర్హులైన అసలైన పేదలకే ఈ ఇళ్లు దక్కేలా పూర్తి పారదర్శక విధానాన్ని అవలంబించనున్నారు.
నేడు మార్గదర్శకాల విడుదల..
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హత ప్రమాణాలు, వార్షిక ఆదాయ పరిమితి తదితర పూర్తి స్థాయి విధివిధానాలను ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రకటించనుంది. పట్టణాల్లో అద్దె భారంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు దీంతో పెద్ద ఉపశమనం కలిగించనుంది. వెలువడనున్న అధికారిక మార్గదర్శకాల అనంతరం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.






