16 July, 2026 | 12:49 AM

గట్టు నిధుల మిస్టరీ..

16-07-2026 12:49 AM

వెండి నాణేలు బయటపడ్డాయి. బంగారం ఎక్కడ?

స్థానిక నేతల పాత్రపై అనుమానాలు.. 

గద్వాల, జులై 15: గట్టు మండల కేంద్రంలో పురాతన నిధుల వెలికితీత తీవ్ర సంచలనం రేపింది. గ్రామంలోని ఓ పాత ఇంటిని కూల్చి మరమ్మతులు చేపడుతుండగా, తవ్వకాల సమయంలో కూలీలకు పురాతన వెండి నాణేలు, బంగారు ఆభరణాలు లభించినట్లు సమాచారం.

ఈ ఘటన ఈ నెల 6న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం గ్రామవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.స్థానికంగా వినిపిస్తున్న వివరాల ప్రకారం తవ్వకాలలో మొత్తం 73 పురాతన వెండి నాణేలు బయటపడగా వాటిలో 33 నాణేలను అలాగే రూ.1 లక్ష నగదును కూలీలు ఇంటి యజమానికి అప్పగించినట్లు తెలిసింది. అయితే అక్కడ లభించినట్లు చెబుతున్న బంగారు ఆభరణాలు మిగిలిన 40 వెండి నాణేలు కొందరు స్థానిక వ్యక్తులు, ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడి తీసుకెళ్లారనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయ్కుమార్ స్థానిక ఎస్‌ఐతో కలిసి రాత్రి వేళల్లో తనిఖీలు నిర్వహించి ఇంటి యజమాని వద్ద ఉన్న కొన్ని పురాతన వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలన కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సమాచారం. చారిత్రక ప్రాధాన్యం కలిగిన గట్టు ప్రాంతాన్ని గతంలో బంగారు గట్టుగా పిలిచేవారని స్థానికులు చెబుతున్నారు.

సుమారు ఐదు దశాబ్దాల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పురాతన నిధులు బయటపడటంతో పురావస్తు శాఖ ఇక్కడ అనుమతి లేకుండా తవ్వకాలు చేపట్టకుండా నిషేధం విధించింది. తాజా ఘటన నేపథ్యంలో బయటపడిన నాణేలు, ఆభరణాల అసలు స్వరూపం ఏమిటి?మరిన్ని విలువైన వస్తువులు మాయమయ్యాయా? అనే కోణాల్లో రెవెన్యూ,పోలీసు అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనపై అధికారిక నివేదిక వెలువడాల్సి ఉండగా విచారణ పూర్తయ్యే వరకు పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.