15 May, 2026 | 3:51 AM

కర్షకుల కష్టాలు తీర్చేందుకు సతీపతుల విశిష్ట కృషి

15-05-2026 01:36 AM

తోడునీడగా నిలిచిన కలెక్టర్ ఎస్పీ దంపతులు

మహబూబాబాద్, మే 14 (విజయక్రాంతి): అన్నదాతల ఆవేదనను అర్థం చేసుకుని, రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్ దంపతులు చేస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అధికార హోదాలను ప్రజాసేవకు అంకితం చేస్తూ, కర్షకుల కష్టాలను కడ తీర్చేందుకు ఆ దంపతులు తోడునీడగా నిలుస్తున్న సతీపతులు మహబూబాబాద్ జిల్లా రైతుల మనసుల్లో ప్రత్యేక స్థానం అందుకుంటున్నారు.

జిల్లావ్యాప్తంగా నెలకొన్న ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఏర్పడ్డ ప్రతిష్టంబన తొలగించడానికి కార్యరంగంలోకి దిగారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి నేరుగా రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ, వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల వేగవంతనికి అటు కలెక్టర్ స్నేహ శబరిష్, ఇటు ఎస్పీ డాక్టర్ శబరీష్ అధికార, పోలీస్ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.

గురువారం జిల్లాలోని నెల్లికుదురు మండలంలో కలెక్టర్, ఎస్పీ దంపతులు కలిసి ధాన్యం, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వేగంగా కొనుగోలు నిర్వహించడానికి అవసరమైన చర్యలను సూచించారు. ధాన్యం రవాణా, అన్లోడింగ్, గోదాముల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను చేపట్టారు.

ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతులు నేరుగా తమ ధాన్యం మొక్కజొన్న పంట ఉత్పత్తులను విక్రయించడానికి వేగవంతమైన చర్యలు చేపట్టారు. జిల్లా సారధులైన కలెక్టర్, ఎస్పీ దంపతులు రైతుల సంక్షేమానికి చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.