18 August, 2026 | 1:32 AM

తెలంగాణలో బీసీల రాజ్యాధికారమే లక్ష్యం

18-08-2026 12:58 AM
  1. ‘సర్జికల్ స్ట్రైక్59’లో కీలక గణాంకాల వెల్లడి
  2. టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): తెలంగాణలో బీసీల జనాభా, ఓటు బ్యాంకు బలం ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయ అధికారం మాత్రం వారికి దక్కడం లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘సర్జికల్ స్ట్రైక్59’ కార్యక్రమంలో భాగంగా నాలుగు నియోజకవర్గాల రాజకీయ గణాంకాలను వివరించారు.

మహేశ్వరం, ఎల్బీనగర్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో బీసీల ఓటు శాతం గణనీయంగా ఉన్నప్పటికీ.. రాజకీయంగా బీసీలు ఎందుకు వెనుకబడుతున్నారనే అంశాన్ని మల్లన్న ప్రస్తావించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 5,46,654 మంది ఓటర్లు ఉండగా.. వారిలో సుమారు 2,83,540 మంది బీసీ ఓటర్లు ఉన్నారని మల్లన్న తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 43,429 మంది మాత్రమే ఉన్నప్పటికీ గత 15 ఏళ్లుగా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. 

ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు ఆరు లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 3,79,995 మంది బీసీ ఓటర్లు ఉన్నారని మల్లన్న పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సుమారు 47,172 మంది మాత్రమేనని తెలిపారు. బీసీ నాయకుడు మధు యాష్కీ గౌడ్ వంటి నేతలను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. పరిగి నియోజకవర్గంలో సుమారు లక్షన్నర మంది బీసీ ఓటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 68 వేల మంది ముదిరాజ్ ఓటర్లు ఉన్నారని మల్లన్న తెలిపారు.

ఇంతటి బీసీ ఓటు బలం ఉన్నప్పటికీ 1985 నుంచి ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే లేకపోవడం ఆందోళనకరమన్నారు. కేవలం 13,781 మంది రెడ్డి ఓటర్లు ఉన్నప్పటికీ రాజకీయంగా ఆ వర్గానిదే ఆధిపత్యంగా కొనసాగుతోందని విమర్శించారు. తాండూరు నియోజకవర్గంలో 1,35,653 మంది బీసీ ఓటర్లు ఉన్నారని మల్లన్న తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 12,530 మంది మాత్రమే ఉన్నప్పటికీ.. బీసీల మధ్య విభేదాలను సృష్టించడం ద్వారా రెడ్డి రాజకీయ నాయకత్వం ప్రయోజనం పొందుతోందని ఆరోపించారు.

బీసీ నాయకులు ఇకనైనా తమ ఓటు బలాన్ని గుర్తించాలని మల్లన్న పిలుపునిచ్చారు. హనుమంతుడికి తన బలం తెలియనట్లే.. బీసీలకు కూడా తమ రాజకీయ బలం తెలియడం లేదన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటే రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి బీసీలకు ఉందని పేర్కొన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం, ఎల్బీనగర్, పరిగి, తాండూరు సహా ‘సర్జికల్ స్ట్రైక్59’లో గుర్తించిన నియోజకవర్గాల్లో బీసీల రాజకీయ ఆధిపత్యాన్ని స్థాపించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని మల్లన్న స్పష్టం చేశారు.