18 August, 2026 | 1:47 AM

పేపర్ లీకులకు చెక్!

18-08-2026 12:57 AM
  1. పరీక్షల నిర్వహణలో ఏఐ, బ్లాక్‌చైన్
  2. పకడ్బందీగా డిజిటల్ విధానం   
  3. పారదర్శకత, భద్రతే లక్ష్యంగా కొత్త వ్యవస్థ
  4. మానవ ప్రమేయం తగ్గించేలా సంస్కరణలు 
  5. త్వరలో వరుసగా నోటిఫికేషన్లు
  6. పాత విధానాలకు స్వస్తి, కొత్త టెక్నాలజీకి శ్రీకారం

హైదరాబాద్, ఆగస్టు 17(విజయక్రాంతి):  పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల నిర్వహణలో లోపాల కు చెక్ పెట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్పీ) సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగార్థుల్లో నమ్మకం పెంచేలా పరీక్షల ప్రక్రియను మరింత పారదర్శకంగా, పకడ్బందీగా మార్చాలని నిర్ణయించింది. పరీక్ష నిర్వహణ నుంచి తుది ఎంపిక జాబితా విడుదల వరకు ప్రతి దశలో సాంకేతికతను వినియోగానికి పెద్దపీట వేయనుంది.

ఇప్పటి వరకు ఉన్న పాత పద్ధతులను పక్కనబెట్టి సరికొత్త సాంకేతికతను జోడించి పరీక్షలను పక్కాగా నిర్వహించనుంది. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్ చైన్, డిజిటల్ ప్రాసెసింగ్ లాంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను మరింతగా ఉపయోగించనున్నది. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు, వాయిదాలు, ఫలితాల జాప్యానికి ఆస్కారం ఉండొద్దన్నది ప్రభుత్వ ఉద్దేశం.

నిరుద్యోగుల్లో నమ్మకం కలిగేలా..

నిజానికి టీజీపీఎస్సీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు విశ్వసనీయత. ఒక నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయం. మధ్యలో పేపర్ లీకై రీ-ఎగ్జామ్‌లు, కోర్టు కేసులతో అభ్యర్థుల జీవితాలు గాలిలో వేలాడేవి. దీంతో టీజీపీఎస్సీపై ఓ రకమైన అపవాదు అభ్యర్థుల్లో ఏర్పాటైంది. టీజీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తుందనే నమ్మకాన్ని ఉద్యోగార్థుల్లో తీసుకురావాలి.

ఇందుకు ఇప్పటికే కమిషన్ ప్రణాళికలు రచించింది. ఇకపై లీకేజీలకు తావులేకుండా, సకాలంలో ఫలితాలిచ్చే వ్యవస్థను తీసుకురానుంది. ఇందుకోసం సాంకేతికను మరింతగానూ వినియోగించనుంది. ఇకపై క్వశ్చన్ బ్యాంక్ తయారీ నుంచి ఫలితాలు వెల్లడించే వరకు ప్రతి దశలోనూ మానవ ప్రమేయాన్ని వీలైనంత తగ్గించాలనుకుంటుంది. 

ఏఐతో పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లక్షల ప్రశ్నలతో డిజిటల్ బ్యాంక్, పరీక్షకు కొద్ది గంటల ముందే ప్రశ్నపత్రాన్ని రూపిందించేలా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఫలితాల్లో అనుమానాస్పద ప్యాటర్న్‌లు, ఒకే సెంటర్‌లో ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు, పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది కదలికలు లాంటివి పసిగట్టేలా సాంకేతికను వినియోగించనున్నారు. ప్రశ్నపత్రాల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడనున్నారు.

ప్రశ్నపత్రం ఫైల్ ఒక కంప్యూటర్ నుంచి మరోక కంప్యూటర్‌కు వెళ్లిన ప్రతిసారి రికార్డ్ అవుతుంది. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఓపెన్ చేశారో ట్రాక్ చేసేలా దీనిద్వారా తెలుసుకునే వీలుంది. ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం, మెరిట్ లిస్టులో కూడా సాంకేతికతకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైనది ఫలితాలను వీలైన్ని తక్కువ రోజుల్లో రెండు మూడు నెలల్లో ప్రకటించేలా చర్యలు తీసుకుంటుంది. 

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు 

గతంలో టీజీపీఎస్సీ నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే మరోక నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఈ విధానాన్ని స్వస్తి పలికి ఇక వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ఈ వారంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వబొతోంది.

వివిధ శాఖల్లో సిద్ధంగా ఉన్న ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఉద్యోగార్థులు కూడా పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. టీజీపీఎస్సీని దేశంలోనే మోడల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా నిలిచేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నా అమలే అసలైన పరీక్ష. కొత్తగా తీసుకొస్తున్న సాంకేతికతను సమర్థంగా వాడడం, సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం కూడా ప్రధానమే.