రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్
బూర్గంపాడు, ఏప్రిల్ 16,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసుశాఖ అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం బూర్గంపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రైవింగ్ లో నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అరైవ్ .. అలైవ్ కార్యక్రమం కేవలం ఒక నినాదం కాకుండా.. రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్యమంలా ముందుకు సాగాలన్నారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సభ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాద మరణాలు జరిగి, ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు.
ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం వివిధ సంఘాల మహిళలు, ప్రజా ప్రతినిధులతో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో భద్రాచలం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం పుల్లయ్య, తహశీల్దార్ ప్రసాద్,సర్పంచ్ మందా నాగరాజు, ఎంఈఓ యదు సింహరాజు, ఎస్‌ఐలు మేడా ప్రసాద్, నాగభిక్షం పాల్గొన్నారు.






