భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఖమ్మం, ఏప్రిల్ - 16(విజయ క్రాంతి): ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ భూ భారతి పైలట్ పోర్టల్ ప్రాజెక్ట్ అమలు పై రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
రైతులు ఇంటి వద్ద నుంచి కూడా స్లాట్ బుకింగ్ చేసుకునేలా పోర్టల్ తయారు చేశామని, రైతులు లాగిన్ కాగానే భూమి వివరాలు కనిపిస్తాయని, ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు చెల్లించిన తర్వాత ఏడు రోజుల లోపు సర్వే పూర్తి చేస్తారని తెలిపారు. రైతు సర్వే మ్యాప్ నకు యూనిక్, భూధార్ నెంబర్లు కేటాయిస్తారని భూభారతి పోర్టల్ లో కూడా వివరాలు నిక్షిప్తమవుతాయని అన్నారు.
పైలెట్ ప్రాజెక్టు క్రింద ముందుగా కూసుమంచి మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూ భారతి కింద ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరితగతిన పరిష్కారించేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాలేరు నియోజకవర్గ స్పెషల్ అధికారి రమేష్, కూసుమంచి మండల తహసీల్దారు సైదులు, కలెక్టరేట్ భూ భారతి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






