14 March, 2026 | 6:50 AM

పేదల సంక్షేమాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

14-03-2026 12:28 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

2 సంవత్సరాలలో బీరోలు గ్రామ అభివృద్ధికి 29 కోట్ల 92 లక్షలు మంజూరు

తిరుమలాయపాలెం(కూసుమంచి), మార్చి -13(విజయక్రాంతి): పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

బీరోలులో రూ. 2 కోట్ల 59 లక్షలతో బీరోలు నుండి ఏలువారిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, 64 లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, బంధంపల్లిలో 5 కోట్ల 50 లక్షలతో దమ్మాయిగూడెం నుండి సోలిపురం రోడ్డు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బీరోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆత్మ గౌరవంగా జీవించేలా చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డులు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసిందని అన్నారు.

రూ. 2 కోట్ల 59 లక్షలతో బీరోలు నుండి ఏలువారి గూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు, 64 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రోడ్లు, బంధంపల్లిలో 5 కోట్ల 50 లక్షలతో దమ్మాయి గూడెం నుండి సోలిపురం రోడ్డు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నట్లు మంత్రి తెలిపారు.

బంధం పల్లి నుండి అస్నాబాద్ వరకు 4 కోట్ల 5 లక్షల రూపాయలతో చేపట్టిన తారు రోడ్డు, కట్టెల పాడు నుంచి బీరోలు వరకు 6 కోట్ల 50 లక్షలతో తారు రోడ్డు, చౌటుపల్లి బీరోలు రోడ్డుకు 3 కోట్ల 20 లక్షల కల్వర్టు నిర్మాణం, కూసుమంచి బీరోలు రోడ్డుకు 2 కోట్లతో కల్వర్టు నిర్మాణం, బీరోలు నుంచి మేడేపల్లికి కోటి 87 లక్షలతో తారు రోడ్డు, బీరోలు నుంచి మేడేపల్లి రోడ్డు సిడీ పనులకు 30 లక్షల రూపాయలు, బీరోలు పెద్ద చెరువు మరమ్మత్తుకు 2 కోట్ల 25 లక్షలు, 80 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, 15 లక్షలతో అంగన్వాడి భవనం, 6 లక్షల రూపాయలతో త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేశామని, బీరోలు గ్రామానికి ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాల మూడు నెలల్లో 29 కోట్ల 92 లక్షలు ఖర్చు చేసిందని అన్నారు.

రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాలు, రైతును రాజును చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, మహిళలు ఆత్మ గౌరవంతో జీవించేలా పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. నిరుద్యోగ యువత కు గతంలో ఎన్నడూ లేని విధంగా 72 వేల  ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. సాగునీరు, త్రాగునీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం భవిష్యత్తులో పేదలకు మరింత అండగా ఉంటుందని అన్నారు. 

పల్లెల అభివృద్ధికే పెద్దపీఠ: కలెక్టర్

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ బీరోలు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నూతనంగా ఎన్నిక కాబడిన పాలక వర్గానికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులకు అవసరమైన శిక్షణ అందించామని, ప్రభుత్వ ఆశయాల మేరకు 99 రోజుల వ్యవధిలో పంచాయతీకి విడుదలైన నిధులు వినియోగిస్తూ గ్రామాలలో పారిశుద్ధ్యం, పచ్చదనం, చిన్న చిన్న మరమ్మత్తు పనులు చేయాలని అన్నారు. 

అనంతరం సమావేశంలో రాకాసితండా గ్రామంలోని ఆకేరు ముంపు బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాలను, తిరుమలాయపాలెం మండలానికి చెందిన మస్జిద్ కమిటీలకు, ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను మంత్రి అందజేశారు. అనంతరం బీరోలు గ్రామంలోనీ శ్రీరామ లింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలారు సాహెబు, సర్పంచ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.