1 May, 2026 | 3:19 AM

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

01-05-2026 01:55 AM
  1. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత 
  2. గజ్వేల్-భువనగిరి రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో 
  3. ధాన్యం ధర తగ్గిందని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్‌లో రైతుల ఆందోళన 

యాదాద్రి భువనగిరి/ ఆలేరు/ కేసముద్రం, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి విమర్శించారు. కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని గజ్వేల్-భువనగిరి ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. తుర్కపల్లి మండలం ములకల పల్లిలో ధాన్యం కోనుగోలు కేంద్రం వద్ద రైతుల ధాన్యం రాశులను పరిశీలించారు.

రైతుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం రైతులతో కలసి రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కోనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు గింజ కూడా కొనకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. కోనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు, కాంటాలు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమ న్నారు. రైతును రాజు చేస్తామని చెప్పి అధికారం లోనికి వచ్చిన కాంగ్రెస్ రైతులను రోడ్డుపాలు చేస్తుందన్నారు. కోనుగోళ్లు ప్రారంభించకుంటే వేలాది మంది రైతులతో కలసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.

నిరసనలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరు రాంచంద్రా రెడ్డి, మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, మండల సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్, సర్పంచ్ గుగులోతు మోతిరాం నాయక్, మాజీ ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, నాయకులు బూక్యా రవీందర్ నాయక్, మేకల బాలకృష్ణ, ధీరావత్ రాజేశ్ నాయక్, మాజీ సర్పంచులు ఇమ్మడి మల్లప్ప, గుంటి శ్రీశైలం రైతులు తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రంలో రైతుల ఆందోళన..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు కుమ్మక్కై ధాన్యం ధరలు గణనీయంగా తగ్గించారని ఆరోపిస్తూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం వరకు సన్న రకం ధాన్యానికి గరిష్ఠంగా రూ.2,500 క్విం టాలకు పలికిందని, గురువారం ఒక్కసారిగా క్వింటాలుకు రూ.2,100-- చొప్పున ధర పెట్టడంతో క్వింటాలుకు రూ.300 చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వ హించారు.

ప్రభుత్వ స్పందించి తమకు మద్ద తు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. స్పందించిన మార్కెట్ కార్య దర్శి అమరలింగేశ్వర్ రావు, రైతు సంఘం నాయకులు యాకుబ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ వసంతరావు తదితరులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డు లో ధాన్యం రాశులను పరిశీలించి తేమ శాతాన్ని లెక్కించారు. తేమ తగ్గిన ధాన్యానికి కొంత ధర పెంచి ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు.

రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి తీసుకు వస్తే మద్దతు ధర లభిస్తుందని, తేమ అధికంగా ఉండటం వల్ల ధరలు తగ్గడానికి కారణం అవుతుందని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. ఇదిలా ఉం డగా మార్కెట్లో ధాన్యం ధరలు అమాంతం తగ్గడంతో తక్కువ ధరకు విక్రయించలేక కుమ్మరి శేఖర్ అనే రైతుతో పాటు మరికొందరు మార్కెట్‌కు విక్రయించడానికి తెచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, అయితే గత ఏడాది యాసంగి సీజన్లో పండించిన సన్న ధాన్యానికి చాలామంది రైతులకు బోనస్ ఇవ్వలేదని, ఈసారి కూడా పరిస్థితి ఏమిటి అన్నది తెలియదని అందుకే తాము మార్కెట్‌కు ధాన్యాన్ని విక్రయించడానికి తెచ్చామని, ఇక్కడ కూడా కనీసం వ్యాపారులు తమకు మద్దతు ధర ఇవ్వడం లేదని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.