calender_icon.png 30 December, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలి

30-12-2025 01:18:39 AM

  1. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
  2. అందుకు ఉద్యోగులు పని చేయాలి
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి):ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చేలా రెవెన్యూ ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతేడాదిలో ఏ విధంగా ప్రభుత్వ ప్రాధమ్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారో కొత్త సంవత్సరంలోనూ అదే విధంగా పని చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ రెవెన్యూ జేఏసీ చైర్మన్ విలచ్చిరెడ్డి నేతృత్యంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతలు మంత్రి పొంగులేటిని సోమవారం కలిశారు.

అనంతరం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్‌ఎస్‌ఏ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాదిలో రైతులకు భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టాన్ని తెచ్చామని గుర్తు చేశారు. భూ భారతి చట్టం రాకతో రెవెన్యూ సేవలు క్షేత్ర స్థాయిలోనూ అందుబాటులోకి వచ్చాయన్నారు.

కేంద్రీకృతమై ఉన్న రెవెన్యూ సేవలను వికేంద్రీకరణ చేశామన్నారు. గ్రామాల్లోనే రైతులకు రెవెన్యూ సేవలను అందించేందుకు గ్రామ పాలనా అధికారుల(జీపీఓ) ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఏ విధమైన భూ సమస్య ఉన్న జిల్లా స్థాయిలోనే పరిష్కారం చేసేలా చేశామన్నారు.

కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం రాధ, సెక్రటరీ జనరల్ పూల్సింగ్ చౌహాన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి భిక్షం, టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర నాయకులు జయశ్రీ, రాంబాబు, మల్లేష్, పాల్గొన్నారు.