13 June, 2026 | 1:55 AM

వానాకాలం (ఖరీఫ్) పంటల సాగుపై రైతాంగానికి ప్రభుత్వం అవగాహన కల్పించాలి

13-06-2026 12:54 AM

ఆరుతడి పంటల సాగు ప్రోత్సహించాలి

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, 

రుణ సదుపాయం ప్రభుత్వమే కల్పించాలి.

 పంటలు పండిన తర్వాత గిట్టుబాటు ధరతో 

కొనుగోలు చేస్తామని రైతాంగానికి భరోసా కల్పించాలి

బోధన్, జూన్12 (విజయక్రాంతి): సాలూర మండల కేంద్రంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ డివిజన్ సహాయ బి. మల్లేష్ మాట్లాడుతూ... ఎల్ ని నో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ ప్రకటిస్తున్నందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల సాగు పై రైతాంగానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బి. మల్లేష్ అభిప్రాయపడ్డారు.

నిజామాబాద్ జిల్లాతో పాటు బోధన్ డివిజన్ ప్రాంతంలో కూడా రైతాంగం అలవాటు ప్రకారం ఎప్పటి మాదిరిగా పండించే పంటలకే మొగ్గు చూపుతున్నారని కానీ వాతావరణ నిపుణులు చెబుతున్నట్లు ఎల్ ని నో ప్రభావంతో తగినంత వర్షాలు పడకపోతే రైతాంగం భారీగా నష్టపోయే అవకాశం ఉంటుందని కాబట్టి ఈ విషయంపై రైతాంగానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ ఏ పంటలను వేయాలో తెలియజేస్తూ విత్తనాలు ఎరువులు పురుగుమందులు ప్రభుత్వమే రైతాంగానికి సప్లై చేయాలని రైతాంగం పండించిన పంటలను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని బి.మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. దేవయ్య, సి.హెచ్ రమేష్, మరియు ఎస్. లక్ష్మయ్య, ఆర్. నాగేష్, లక్ష్మణ్,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.