9 May, 2026 | 3:27 AM

రైతన్నలకు సర్కార్ అండ.. దళారులను నమ్మి మోసపోవద్దు

09-05-2026 12:57 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి

కడ్తాల్, మే 8 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని సింగల్ విండో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు. 

రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సన్న రకం కు క్వింటాలుకు 2,389 (దీనికి అదనంగా 500 బోనస్ కలిపి మొత్తం 2,889 ఇస్తుంది అని,దొడ్డు రకం క్వింటాలుకు 2,369 రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ధాన్యం విక్రయించిన రైతులకు వేచి చూసే అవసరం లేకుండా, కేవలం రెండు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దళారుల చేతిలో చిక్కి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని ఆయన కోరారు.

నాణ్యత విషయంలో జాగ్రత్త

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే సమయంలో రైతులు తగిన తేమ శాతం ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తీసుకువస్తే వెంటనే తూకం వేసి మిల్లులకు తరలిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీత,వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సంధ్య వెంకటేష్, పాలకుర్ల కర్ణాకర్ గౌడ్,  సింగల్ విండో డైరెక్టర్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.