31 May, 2026 | 12:39 AM

ఇసుక తుఫాన్ బీభత్సం

31-05-2026 12:39 AM
  1. వణికిన రాజస్థాన్‌లోని చురు ప్రాంతం
  2. మిట్టమధ్యాహ్నమే అంధకారం
  3. సుమారు అరగంటపాటు ప్రభావం
  4. 6౦ ౮౦ కి.మీ వేగంతో గాలులు 
  5. వెనువెంటనే భారీ వర్షం.. అయోమయానికి గురైన ప్రజలు

జైపూర్, మే ౩౦: రాజస్థాన్‌లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. చురు, బికనీర్ ప్రాంతాలను అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన తుఫాను సుమారు గంటలపాటు కొనసాగింది. సుమారు ౬౦ ౮౦ కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయి భూఉపరితలం నుంచి 80  అడుగుల ఎత్తులో కమ్ముకుంది. తుఫాను ధాటికి ప్రభావిత ప్రాంతాల్లో మిట్టమధ్యాహ్నమే అంధకారమయ్యాయి. నివాసాల్లో ఉండే వారు, వాహనాలపై ప్రయాణించే వారు భయభ్రాంతులకు గురయ్యారు.

వాహనదారులు అక్కడికక్కడే రోడ్డుపక్కన వాహనాలు నిలిపి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరికొందరు వాహనదారులు పగటిపూట హెడ్‌లైట్లు వేసుకుని ప్రయాణం కొనసాగించారు. మిద్దెలు, అపార్ట్‌మెంట్లు వంటి ఎత్తున భవనాల్లో నివసించే వారు భయభ్రాంతులతో బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. తుఫాను తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తుఫాను ప్రభావం చురు, బికనీర్ నగరాలపై తీవ్రంగా ఉండగా, శ్రీగంగనగర్, జైపూర్‌తో కొంత ప్రభావం వరకు ఉంది.

రాగల ౨౪ గంటల్లో మళ్లీ తుఫాను వచ్చే అవకాశం ఉందని, తుఫానుకు తోడు భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. బికనీర్, జైపూర్, అజ్మీర్, భరత్పూర్, కోట, జోధ్పూర్, ఉదయ్‌పూర్ ప్రాంతాల్లో గంటకు 60 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు మరో నాలుగు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వర్షపాతం కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. మరోవైపు, ఆస్తి, ప్రాణ నష్టంపై అక్కడి యంత్రాంగం విచారిస్తున్నది.

తుఫాను ఎందుకంటే..

భూఉపరితలంపై ఏర్పడే తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా ఇసుక తుఫానులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లోని నేల పొడిగా, గుల్లగా ఉంటుంది. వేసవిలో ఎండ తీవ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కుతుంది. ఈ సమయంలో బలమైన గాలులు వీస్తే, భూమికి దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి, తేలికే వేగంగా పైకి ఎగసిపడుతుంది. అప్పుడు అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడి తుఫానుగా మారుతుంది. గాలులు భూఉపరితలంపై ఉన్న పొడి ఇసుకను, ధూళి కణాలను వాతావరణంలోకి వదులుతాయి. ఈ క్రమంలో ఇసుక రేణువుల ఘర్షణ ఏర్పడి తుఫాను తీవ్రత మరింత పెరుగుతుంది.