17 July, 2026 | 9:31 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి!

17-07-2026 09:31 PM

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు

కామారెడ్డి,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, ప్రఖ్యాత శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 13 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత 20 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90కి పైగా పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తూ, ఉపా వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

నీట్ పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే ఈ నెల 20న నిర్వహించనున్న "చలో పార్లమెంట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.