హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి
సియెట్ మారుతి హిల్స్ కాలనీ వాసులు
ముషీరాబాద్, మే 17 (విజయక్రాంతి): హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సియెట్ మారుతి హిల్స్ కాలనీలో హైడ్రా ఎలాంటి తవ్వకాలు, బండ్ నిర్మాణం, ఫెన్సింగ్ పనులు చేపట్టకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సియెట్ మారుతి హిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. సదానందం, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12/13 కేసులో హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 1990 మధ్య సియెట్ సొసైటీ ప్రైవేట్ పట్టా భూములను కొనుగోలు చేసి హుడా అనుమతులతో కాలనీ అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అఫిడవిట్‌కు విరుద్ధంగా 2016 ముసాయిదా ఎఫ్టీఎల్ మ్యాప్‌లో ఈ ప్రాంతాన్ని చెరువు పరిధిలో చూపడంతో 86 ప్లాట్ యజమానులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో హైకోర్టు 2026 జనవరి 5న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, హైడ్రా తవ్వకాలు కొనసాగించడం ఆదేశాల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బీఎస్‌ఎన్‌ఎన్ రాజు, రాజేంద్రప్రసాద్, శుభవాణి, రాధ, కాలనీవాసులు పాల్గొన్నారు.






