calender_icon.png 8 February, 2026 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూతులే భవిష్యత్తు!

08-02-2026 01:05:27 AM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాటల్లో 

చెప్పాలంటే.. ‘వేటూరి రాసినన్ని బూతు పాటలు ఎవరూ రాయలేదు’! ఇదేమాటపై ఓ సందర్భంలో వేటూరి స్పందిస్తూ.. “చూడు నాయనా, నేను రాయకపోతే దర్శక నిర్మాతలు మరొకరితో రాయించుకుంటారు. అంతేకానీ అది బూతు పాట అని అపేయరు కదా. అలాగే ‘వేటూరి పాటలు రాయలేకపోతున్నారు.. ఆయన పని అయిపోయింది’ అని ప్రచారం చేస్తారు.

కాబట్టి కాలాన్ని బట్టి, ట్రెండును బట్టి మనం మారకపోతే సినీరంగంలో ఉండలేం’ అన్నారుట!! కాలాన్ని బట్టి, ట్రెండును ఫాలో అవుతూ, తెలుగు సినిమాకు బూతులే భవిష్యత్తు అని బూతు సంస్కృతిని తు.చ తప్పకుండా పాటిస్తోంది నేటి సినీతరం! పెద్దలు నర్మగర్భంగా చెప్పిన సద్దిమాటలను సభాముఖంగా మైకుల్లో గుంజి గుంజి చెప్తున్నారు. బరాబర్ రాస్తాం.. పడతాం.. ఏమన్నా అంటే పగలగొడతామంటూ ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. 

నరేశ్ ఆరుట్ల

* సీరియల్ నటుడు, యాంకర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ మూవీ ఈవెంట్‌లో చంద్రహాస్ స్వయంగా పాడిన ఓ పాట, తీవ్ర వివాదాస్పదమైంది. పాట నిండా బూతులు ఉండటమే ఇందుకు కారణం. పబ్లిక్‌గా బూతులతో పాటలు పాడుతూ, అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించిన చంద్రహాస్‌పై చర్యలు తీసుకోవాలని, ఆ సినిమాను బ్యాన్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. మూవీ ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాల్సిందేనా? బూతులు పెడితేనే జనం థియేటర్లకు వస్తారా? అనేది ప్రస్తుతం అన్నివర్గాల నుంచి తలెత్తుతున్న ప్రశ్న. 

మరోవైపు ‘బరాబర్ ప్రేమిస్తా’ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న నటుడు జేడీ చక్రవర్తి సైతం ‘క్రియేటివిటీతో, ప్రజలను థియేటర్లకు రప్పించాలే కానీ ఇలాంటి రోత పుట్టించే భాష అంగీకారయోగ్యం కాదు’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. 

ఇంకోవైపు సినిమా దర్శక నిర్మాతలు కూడా ఈ పాటపై క్లారిటీ ఇచ్చారు. ‘సినిమాలో తన క్యారెక్టరైజేషన్‌ను చెప్పాలనే ఉద్దేశంతో చంద్రహాస్ ఓ పాట పాడాడు. దాంట్లో తప్పులు దొర్లాయి. మేం కూడా ఆ పాట విని షాక్ అయ్యాం. ఆ పాట సినిమాలో లేదు. సినిమాలో ఎలాంటి బూతులు, అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవు..’ అంటూ చెప్పుకొచ్చారు. 

ఏదేమైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే క్రమంలో సినిమావాళ్లు ఇలాంటి ఆటిడ్యూడ్ చూపించడం ఇదేం కొత్త కాదు. పలు సినిమాల్లో సన్నివేశాలు, హీరోల పాత్రలు వివాదస్పదం కావటం తెలుగు చిత్రపరిశ్రమలో షరా మామూలే. అయితే, చాలా సందర్భాల్లో పాటలు ఎక్కువగా వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. 

సరిహద్దు ‘గీత’ దాటిన రాతలెన్నో.. 

పాట చుట్టూ అల్లుకున్న వివాదాలెన్నో తెలుగు నాట చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ‘పుష్ప’ చిత్రంలో సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా.. ఊ ఊ అంటావా..’ ఎంతటి విజయాన్ని సాధించిందో అదే స్థాయిలో కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఈ పాటలో పురుష జాతిని కించపరుస్తూ లిరిక్స్ ఉన్నాయంటూ కేసులు పెట్టారు. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘గుడిలో బడిలో’ పాటలోని ‘నమకం’, ‘చమకం’ అనే రెండు పదాలను బ్రాహ్మణ సంఘాల డిమాండ్ మేరకు చిత్ర యూనిట్ తొలగించింది. ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగమ్మ మంగమ్మ..’ పాటలో ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లిరిక్స్ యాదవ మహిళలను కించపరిచేలా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

నాగశౌర్య, రితూ వర్మ జంటగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగ’ పాట రాసి అనంత శ్రీరామ్‌పై అప్పట్లో క్రిమినల్ కేసులుపెట్టారు. భక్తి పాటను ఐటెం సాంగ్ చేస్తారా..? అంటూ విమర్శించారు. యుగంధర్ దర్శకత్వం వహించిన ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాలోని ‘భజ గోవిందం’ అనే పాటపైనా దుమారం చెలరేగింది. భక్తి ట్యూన్ తీసుకొని, పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ సనాతన ధర్మ పరిరక్ష సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాదం ముదరడంతో ఆ లిరిక్స్‌ను తొలగించింది చిత్రబృందం. 

దశాబ్దాల ‘బూతు’ చరిత్ర.. 

తెలుగు సినిమాల్లో అశ్లీల సాహి త్యం వస్తుండటాన్ని ప్రస్తుత కాలానికే పరిమితం చేయలేం. ఇది దశాబ్దాలుగా మారు తూ వస్తోంది. ‘శృంగారం’, ‘బూతు’ అనే మాటలకు మధ్య ఉన్న సన్నని సరిహద్దు గీతను దాటుతూ అనేక పాటలు వివాదాలకు దారితీశాయి. పాత కాలం నుంచి పాటల్లో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, ద్వంద్వార్థాలతో కూడిన సాహిత్యం ఉండేది. ‘ఆకు చాటు పిందె తడిసే’ (వేటగాడు), ‘అబ్బనీ తీయని దెబ్బ’ (జగదేకవీరుడు అతిలోకసుందరి) వంటి పాటల్లో సాహిత్యం పరోక్షంగా శృంగార భావాలను స్ఫురింపజేస్తుంది. ఈ పాటలు ఆ కాలంలో శృంగారంగా అనిపించినా, విశ్లేషిస్తే ద్వంద్వార్థాలు కనిపి స్తాయి.

ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లోని కామెడీ సన్నివేశాలు, పాటల్లో ద్వం ద్వార్థాలను ఎక్కువగా ఉంటాయి. 90వ దశకంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కొన్ని సినిమాలు ద్వంద్వార్థ సాహిత్యంతో ఆకర్షించాయి. ‘క్షణం క్షణం’ (1991) వంటి రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లో కొన్ని పాటల్లోని వ్యంగ్యం, శృంగార ధోరణి కొనసాగింది. ‘అల్లుడా మజాకా’ (1995) సినిమాలోని ‘అత్తో అత్తమ్మ కూతురో’ వంటి పాటల్లోని సాహి త్యం, హీరోహీరోయిన్లు చిరంజీవి, రంభల మధ్య చిత్రీకరణ తీవ్ర వివాదాలకు దారితీసింది. ‘ఎవండి ఆవిడ వచ్చింది’ సినిమాలోని పాటలు ఆ కాలంలో బాగా వివాదాస్పదమయ్యాయి.

రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన పాత సినిమాల్లోని ‘గూట్లో ఉంది బెల్లం ముక్క’, ‘గుండు సూది’ వంటి పాటల్లోనూ ద్వంద్వార్థాలుంటాయి. ఇవేకాకుండా ‘చిన్నగా చిన్నగా.. (ఠాగూర్), పెట్టమంది పెట్టమంది పిల్ల.. (సాహస వీరుడు సాగర కన్య) వంటి పాటల సాహిత్యం కూడా తరుచూ చర్చకు వస్తుంటు ంది. 2000ల సంవత్సరం నుంచి ఐటమ్ సాంగ్స్ సంస్కృతి పెరిగింది. ‘అ ఆ ఇ ఈ’ (కింగ్), ‘కెవ్వు కేక‘ (గబ్బర్ సింగ్) వంటి పాటల్లో సాహిత్యం మహిళలను వస్తువులుగా చూపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. మొన్నటికి మొన్న రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం లోని‘చికిరి’ పాటలోని ‘సరుకు సామాను చూసి’ అనే పదాలు కూడా ఓ సందర్భంలో ప్రస్తావనకు రావడం గమనార్హం. 

జన్‌జెడ్ కిడ్స్ ‘అసభ్య’తతో నేటి సమాజంపై ప్రభావం 

జన్‌జెడ్ కిడ్స్ ‘అసభ్య’తను నిర్మొహమాటంగా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం నేరుగా అసభ్య పదజాలం వాడటం ఎక్కువైంది. ఇప్పటి సినిమాల్లో యువతను ఆకర్షించడానికి బూతు పదాలను డైలాగులుగా, పాటల పల్లవులుగా మార్చేస్తున్నారు. ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రానికి సంబంధించి హీరో చంద్రహాస్ స్టేజీపై పాడిన ‘గుంజి గుంజి..’ పాటలోని అసభ్య పదజాలం పెద్ద దుమారం రేపింది. సాహిత్యవేత్తల ప్రకారం ‘శృంగారం’ మనసును ఉల్లాసపరిస్తే, ‘బూతు’ కేవలం శరీరాన్ని ప్రేరేపించేలా ఉంటుంది.

కేవలం మాస్ ప్రేక్షకుల మైలేజీ కోసం రచయితలు ట్రెండింగ్ పేరుతో అసభ్య పదాలను యథేచ్ఛగా వాడుతున్నారనే విమర్శలున్నాయి. సెన్సార్ నిబంధనలున్నప్పటికీ ప్రమోషన్ల కోసం పచ్చి బూతులను వాడేస్తుండటం గమనార్హం. కేవలం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి, సోషల్ మీడియాలో క్లిప్పింగ్స్ వైరల్ అవ్వడానికి ఇలాంటి సాహిత్యాన్ని వాడుతున్నారు. ఇలాంటి సాహిత్యం వల్ల యువతపై, ముఖ్యంగా పిల్లల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో ఇలాంటి సాహిత్యం పెరగడం వల్ల యువతపై ప్రభావం పడుతుందని మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

వ్యవస్థలో లోపాలే కారణం 

ప్రస్తుత కాలంలో బూతు అనేది బోల్డ్ కంటెంట్‌గా మారిపోయింది. కోపాన్ని, శృంగారాన్ని వ్యక్తపరచడానికి వాడుక భాషలోని తిట్లను సాహిత్యంలో నేరుగా వాడుతున్నారు. సాధారణంగా సినిమాలకు ‘యూ’, ‘యూ/ఏ’, ’ఏ’ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అసభ్య పదాలను మ్యూట్ చేస్తుంది. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వచ్చే సినిమాలకు ఈ నిబంధనలు అంత కఠినంగా లేకపోవడం వల్ల బూతు సాహిత్యం నియంత్రణ లేకుండా పోతోంది.