3 August, 2026 | 1:42 AM

జోగు సంగీత కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలి

03-08-2026 12:22 AM

రెండు నెలలు గడిచినా పురోగతి లేదన్న నవోదయ సిద్ధార్థ

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ

కంగ్టి, ఆగస్టు 2: కంగ్టి మండలం దెగులవాడి గ్రామానికి చెందిన జోగు సంగీత హత్య కేసులో నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ నవోదయ సిద్ధార్థ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి వేదనను అడిగి తెలుసుకున్నారు.

కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మే 27న సంగీత కనిపించడం లేదని కంగ్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించలేదని ఆరోపించారు. అనంతరం మే 29న గ్రామ శివారులో సంగీత మృతదేహం ఎడమ చేయి లేకుండా లభించిందని, పోస్టుమార్టం నిర్వహించినా నివేదికను ఇప్పటి వరకు అందించలేదని తెలిపారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన ప్రతిసారీ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నవోదయ సిద్ధార్థ మాట్లాడుతూ ఘటన జరిగి రెండు నెలలు గడిచినా కేసు దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించకపోవడం విచారకరమన్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేసి అసలు నిందితులను గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ సంస్థ అండగా ఉంటుందని, అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కమిషన్తో పాటు ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జోగు సంగీత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కంగ్టి పోలీస్ స్టేషన్లో ఎస్త్స్ర దుర్గారెడ్డిని కలిసి కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ డాక్టర్ దిగ్గే బాబు, రాష్ట్ర నాయకులు డాక్టర్ ఓంప్రకాష్, కోర్ కమిటీ సభ్యులు ప్రభాకర్, గాల్రెడ్డి, డాక్టర్ బాబురావు, సాయిలు, ఎం.ఏ. ఖైసర్, సంతోష్రావు పాటిల్, బహుజన ప్రసాద్, సురేష్ గౌడ్తో పాటు గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.