నిడిగొండలో ఏదీ ముప్పేశ్వరాలయం?
కుందమాంబగుడి.. ముప్పేశ్వరాలయం కాదు
ముప్పమాంబ కట్టించింది.. కాకతీయశైలి నిర్మాణం
రామప్పగుడితోనే కాకతీయశైలి మొదలు
పొరపాటును దిద్దుకోకపోతే చారిత్రక తప్పిదమే
కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్
నిడిగొండ చరిత్రపూర్వయుగాల నుంచి, మధ్యయుగాల నాటి చారిత్రక కాలాల దాకా వికసించిన మానవ నాగరికతల నగరం. ఇక్కడ జైన, శైవ, వైష్ణవ ధర్మాల బసదులు, దేవాలయాల నిర్మాణాలు, అద్భుత శిల్ప సంపద, శాసనాలున్నాయి.
నిడిగొండలో దొరికిన శాసనాలు వరంగల్ జిల్లా శాసనసంపుటిలో అచ్చయినవి మూడు. అచ్చు కానివి పాతగుట్ట మీద లఘు, దీర్ఘ శాసనాలున్నాయి. వీటిలో తేదీ, వివరాలు లేని భూదానశాసనం మొదటిది, చాళుక్య చక్రేశ్వరుడు త్రిభువనమల్ల దేవర రాజ్యం చేస్తున్నపుడు నాతవాడి పాలకుడు దుగ్గభూపతి, అతని సతి ముప్ప మాంబిక కట్టించిన ముప్పేశ్వరదేవర గుడికి అంగభోగాల కోసం క్రీ.శ.1104లో ఉత్తరాయణ సంక్రాంతిపర్వ సందర్భంగా మాండలి కుడు దుగ్గరస రట్టసముద్రం వెనక 20 మర్తురుల గద్దె(తరి)భూమిని, కేతబరాణి కూడా గుండనిబండెయ నేరపు కుంట నిత్య కార్యక్రమాలకు దానమిచ్చిందని రెండవ శాసనం. క్రీ.శ.1219లో కాకతి గణపతి దేవుని సోదరి, నతవాడి రుద్రుని భార్య కుందమాంబ తనభర్త పేర, తనతండ్రి మహదేవునిపేర, అన్న గణపతి పేర శివలింగాలను, ఇంకా మాధవ, సూర్యులను ప్రతిష్టింపజేసి కుందపురసీమలో భూదానాలు చేసిందని మూడవ శాసనం వల్ల తెలుస్తున్నది.
వరంగల్ జిల్లా శాసనసంపుటి, శా.సం.7, శా.సం.17, శా.సం.57
నిడిగొండలో ప్రస్తుతం విప్పి, కట్టకుండా నిలిచిపోయిన గుడి కుందమాంబ ప్రతిష్ట చేయించిన శైవ త్రికూటం. ముప్పమాంబ కట్టించిన ముప్పేశ్వరాలయం కాదు. ఈ గుడే కాకతీయశైలి నిర్మాణం. రామప్పలో రుద్రేశ్వరాలయం 1213లో పూర్తయితే, నిడిగొండ కాకతీయశైలి దేవాలయం 1219లో పూర్తయింది. రెండింటికి మధ్య ఆరేండ్ల వ్యత్యాసముంది. రెండింటి శిల్పాలలో చాలా పోలికలున్నాయి. 1104నాటి ముప్పేశ్వరాలయం ఎన్నోసార్లు పునరుద్ధరణలు చేయబడి, పాతగుడి రూపురేఖలు మారిపోయాయి.
ప్రస్తుతం లభిస్తున్న శిల్పాల ఆధారంగా అవి కళ్యాణీచాళుక్యశైలి దేవాలయంలోనివని చెప్పడానికి వీలున్నది. ఈ రెండు దేవాలయాల నడుమ 115సం.రాల తేడావుంది. 1104లో దేవాయాల నిర్మాణం కాకతీయశైలిలో కాదు, కళ్యాణీచాళుక్యశైలిలోనే వున్నాయి. కాకతీయశైలి మొదలైంది రామప్పగుడితోనే. ఎందుకు కుందమాంబగుడిని ‘ముప్పేశ్వరాలయ’మంటున్నారో అంతుబట్టదు. గతంలో మేం కూడా కుందమాంబగుడినే ముప్పేశ్వరాలయంగా భావిం చాం. ఆ పొరపాటును దిద్దుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది.
శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం
99494 98698




