21-02-2026 02:05:55 AM
నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం తెలకపల్లి, బిజినపల్లి, నాగర్ కర్నూల్ మున్సిపాలి టీ పరిధిలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెల్కపల్లి మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు, బిజినపల్లి మండలం గంగారం గ్రామంలో నిర్వహించిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం నిర్వహించారు. పేద ప్రజలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
తెలకపల్లి మండలం కార్వంగ గ్రామంలో నూతన సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామస్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పులిజాలకార్వంగ గ్రామాల మధ్య ఉన్న వాగు కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి, త్వరలోనే వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.