మిల్లర్లదే పైచేయి!
- తనిఖీలను అడ్డుకొన్న నిజామాబాద్ మిల్లర్లు
పని మొదలుపెట్టకుండానే వెనుదిరిగిన కమిటీ
జిల్లా కలెక్టర్‌తో చర్చల తర్వాత పరిణామాలు
నిజామాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులను తనిఖీ చేసేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కమిటీ పని మొదలుపెట్టకుండానే వెనుదిరిగింది. సివిల్ సప్లు, విజిలెన్స్ కమిటీలతో సీఎంఆర్ ధాన్యం రాబట్టడం కష్టమవుతుందని భావించిన సివిల్ సప్లు కమిషనర్ డీఎస్ చౌహన్.. ఉన్నతాధికారుల కమిటీని మంగళవారం జిల్లాలో తనిఖీలకు పంపారు.
అయితే, ఈ కమిటీ వస్తున్నదని ముందే పసిగట్టిన పలువురు బడా మిల్లర్లు ఇతర మిల్లర్లతో సోమవారం సమావేశమై తనిఖీలను అడ్డుకొనేందుకు పథక రచన చేసిన ట్టు వార్తలు వచ్చాయి. మంగళవారం ఆ వార్తలే నిజమయ్యాయి. మంగళవారం ఉదయం నిజామాబాద్ కేంద్రానికి వచ్చిన కమిటీ.. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో చర్చలు జరిపింది. అప్పటికే కలెక్టర్‌తో సమావేశమైన మిల్లర్లు తనిఖీలు చేపట్టకుండా కలెక్టర్‌తో చర్చలు జరిపారు.
డిమాండ్లపై చర్చ
మిల్లర్ల చర్చల సారాంశాన్ని సివిల్ సప్లు కమిషనర్‌కు చేరవేసిన కలెక్టర్.. తనిఖీ చేయకుండా కమిటీని నిలువరించారు. దీనితో హైదరాబాద్ నుంచి తనిఖీలు చేసేందుకు వచ్చిన కమిటీ, పని మొదలుపెట్టకుండానే వెనుదిరిగింది. ఆ తర్వాత కలెక్టర్‌తో సమావేశమైన రైస్ మిల్లర్లు, సీఎంఆర్ రైస్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లపై చర్చించారు. ఆ తర్వాత రెండు రైస్ మిల్లర్ల అసోసియేషన్లతో కూడిన 25 మంది సభ్యుల కమిటీ నిజామాబాద్ నుంచి మధ్యాహ్నానికి హైదరాబాద్ వెళ్లి సాయంత్ర వరకు సివిల్ సప్లు కమిషనర్‌తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. చర్చల సారాంశం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. సీఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కమిషనర్‌కు విన్నవించినట్టు తెలిసింది.






