యాదాద్రిలో మార్మోగిన గోవిందనామం
గిరిప్రదక్షిణకు హోరెత్తిన భక్తజనం
యాదాద్రిభువనగిరి, జూన్ 18 ( విజయక్రాంతి): మేళతాళాలు, భక్త జన సంకీర్తనలు, గోవిందనామ స్మరణతో మహిమాన్విత స్వయంభూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మార్మోగింది. నృసింహుడి ఆవిర్భావ స్వాతి తిరునక్షత్రం పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన గిరిప్ర దక్షిణకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆధ్మాత్మిక శోభ ఉట్టిపడింది.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఈ వేడుకకు హాజరయ్యారు. వైకుంఠద్వారం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల మేర కొండ చుట్టూ కాలినడకన స్వామి వారి సేవలో తరించారు. మేళతాళాలు, భక్తి సంకీర్తనలు, భజనలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 5వేల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.
స్వామివారికి శతఘటాభిషేకం
స్వామివారి జన్మనక్షత్రం(స్వాతి) పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. హోమ మండపంలో హవన పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు కలిగిన శతఘటాలతో నైవేద్యం సమర్పించారు. పుణ్యజలాలతో స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాదికాలు నిర్వహించారు. కాగా, యాదాద్రికి భక్తుల నుంచి రూ.35 లక్షల 51వేల 93 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఈవో ఏ భాస్కర్‌రావు తెలిపారు.






