4 August, 2026 | 12:43 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

21-05-2024 01:23 AM

అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన వాహనం 

18 మంది తునికాకు కూలీల మృత్యువాత.. ఆరుగురికి గాయాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

రాయ్‌పూర్, మే 20:  ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో సోమవారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కూలీలు లోయలో చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనలో 18 మంది మృతిచెందారు. పలువురు గాయాలపాలయ్యారు. కుక్దూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుయ్ ఆదివాసీ గూడేనికి చెందిన సుమారు 36 మంది తునికాకు కోసేందుకు తెల్లవారుజామున కవర్దా అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. పని పూర్తయిన తర్వాత మధ్యాహ్నం గూడ్స్ రవాణా చేసే వాహనంలో స్వగ్రామానికి బయల్దేరారు.

వేగంగా వస్తున్న వాహనం బహ్పాన్ గ్రామం దాటుతుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. 18 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఎస్పీ అభిషేక్ పల్లవ్ హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీస్ సిబ్బందిని పంపించి సహాయక చర్యలు అందించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి ‘ఎక్స్’ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.