24 March, 2026 | 7:42 AM

మో‘డల్’ హౌస్!

24-03-2026 12:00 AM

పూర్తికాని ఇందిరమ్మ ఇల్లు 

కేసముద్రం, మార్చి 23 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో లబ్ధిదారులు 5లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించుకునే విధంగా ప్రతి మండలంలో ఒక నమూనా మోడల్ హౌస్ నిర్మించాలని ఆదేశించింది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ గత ఏడాది జనవరిలో శంకుస్థాపన చేశారు.

ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం డబుల్ బెడ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ టాయిలెట్, మెట్లతో ఫుల్ షేప్ ఇందిరమ్మ ఇల్లు 45 రోజుల్లో నిర్మించాలని ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను ఆదేశించింది. అయితే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం స్లాబ్ లెవల్ వరకు పూర్తి చేసి వదిలేశారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో పలువురు లబ్ధిదారులు గృహ నిర్మాణం చేపట్టి గృహప్రవేశం చేస్తున్నప్పటికీ, మోడల్ గా చూపించాల్సిన ఇందిరమ్మ మోడల్ హౌస్ అక్కడే పనులు నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది.

5 లక్షల రూపాయల నిధులతో ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేసుకోవాలో లబ్ధిదారులకు ప్రత్యక్షంగా చూపించేందుకు నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ బాలారిష్టాలను ఎదుర్కొంటుంది. కొద్ది రోజులు స్థలం చూపలేదని, ఇంకొద్ది రోజులు ఇసుక దొరకడం లేదని, మరికొద్ది రోజులు వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలిగిందని దాటవేయడం తప్ప, ఇప్పటివరకు మోడల్ హౌస్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి గృహ నిర్మాణ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్ఫూర్తిదాయకంగా, మెటీరియల్ వినియోగం, ఇతర పరికరాలకు, అయ్యే ఖర్చు, ఇతర నిర్మాణ పనులకు, ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, ఫ్లోరింగ్ తదితర పనులకు పెట్టిన ఖర్చు వివరాలను మోడల్ హౌస్ వద్ద ప్రదర్శించి, ఐదు లక్షల్లో ఇంటి నిర్మాణం ఎలా పూర్తి చేసుకోవచ్చో వివరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మోడల్ హౌస్ నిర్మాణం ఏడాది దాటిన పూర్తి కాకపోవడం వల్ల లబ్ధిదారులకు మోడల్ హౌస్ ను ప్రత్యక్షంగా చూపించే పరిస్థితి లేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి.

మోడల్ హౌస్ అసంపూర్తిగా వదిలేయడం వల్ల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు 5 లక్షల్లో ఇల్లు పూర్తి చేసుకునే పరిస్థితి లేక అయోమయం చెందుతున్నారు. ఇప్పటికైనా గృహ నిర్మాణ శాఖ అధికారుల స్పందించి కేసముద్రం మండల కేంద్రంలో అసంపూర్తిగా వదిలేసిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను పూర్తిచేసి లబ్ధిదారులకు ఐదు లక్షల్లో ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా ప్రదర్శించాలని కోరుతున్నారు.