ఎగుమతులకు హైదరాబాద్ కీలకం
ఇండియన్ ఫార్మా కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి విదేశా లకు పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఫార్మా క్లస్టర్లను ఔటర్ రింగ్ రోడ్డు బయట ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన ఇండియన్ ఫార్మా సూటికల్ కాన్ఫరెన్స్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ర్ట ఫార్మా రంగ స్థితిగతులపై ప్రసంగించారు. ఫార్మాలో హైదరాబా ద్‌కు ఉన్న ఇమేజ్‌ను మరింతగా విస్తరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఔటర్ బయట పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తాయని భట్టి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని వెల్లడించారు.
ఫార్మా హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్‌బాబు
ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం కేంద్రంగా మారిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని, ఏఐని అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు.
ఔటర్‌తో అనేక పరిశ్రమలు: మంత్రి కోమటిరెడ్డి
ఔటర్ రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్‌కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఫార్మా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటు అందించాలని కోరారు. న్యాక్ సెంటర్ వద్ద 32 ఎకరాల్లో రాజీవ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్‌లో టిమ్స్, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రూ.8 వేల వెచ్చిస్తున్నామని ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు గాను సీఎస్‌ఆర్ నిధులు ఇచ్చేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు.