యుద్ధ గమనం రెట్టింపు
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై సరిగ్గా నెల రోజులవుతున్నది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేసిన వైమానిక దాడులతో యుద్ధం మొదలైంది. యుద్ధ ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలన్నింటిపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం పడింది. యుద్ధంలో మరణాల సంఖ్య అధికారికంగా వందల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుం టే అనధికారికంగా చాలా ఎక్కువ మరణాలు ఉంటాయని అంచనా.
అమెరికా డిఫెన్స్ విభాగం గణాంకాల ప్రకారం, పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటివరకు పది మందికి పైగా అమెరికన్ సైనికులు మృతిచెందారు. మరో 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇరాన్ గణాంకాల ప్రకారం 1,900 మందికి పైగా మరణించగా, సుమారు 24,800 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం యుద్ధం కారణంగా 28 మంది చనిపోయారు. వీరిలో నలుగురు సైనికులు.
క్షత గాత్రుల సంఖ్య అయితే 5 వేల మందికి పైమాటే. గల్ఫ్ దేశాల్లోనూ 30 మంది వరకు మరణాలు సంభవించాయి. అసలు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని లెబనాన్‌లో 1,189 మరణాలు సంభవించడం, 3 వేల మందికి పైగా క్షతగాత్రులవడం గమనార్హం. హెజ్బుల్లాను అణచివేస్తామనే నెపంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున సైనిక చర్యకు పాల్పడుతున్నది. ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌లో ‘సెక్యూరిటీ జోన్’ పేరిట జరుపుతున్న దాడుల వల్ల ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లెబనాన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. బీరుట్, టైర్ వంటి చారిత్రక పట్టణాలు క్షిపణి దాడులతో శిథిలాలుగా మారాయి.
యుద్ధం వల్ల ఇరాన్, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలు, ఉక్కు కర్మాగారాలు, అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. వాటిని పునరిద్ధంచడానికి కూడా కొన్నేళ్ల సమ యం పట్టేట్టు ఉంది. మరోవైపు, ఇరాన్ హోర్ముజ్ జలసంధి మూసివేయడం పెద్ద పరిణామం. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు చమురు, ఎల్పీజీ సరఫరాకు అడ్డకుంలు ఏర్పడ్డాయి.
చమురు ధరలు రెట్టింపు కావడంతో ఈజిప్ట్ వంటి దేశాలు ఇంధన ఖర్చులు తగ్గించుకునేందుకు రాత్రిళ్లు వ్యాపార సముదాయాలపై కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఎరువులు, ముడి పదార్థాల రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌కు చెందిన తిరుగుబాటుదారులైన హౌతీలు యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తాజాగా క్షిపణి దాడులు చేశారు. దాడులను హౌతీల ప్రతినిధి యాహ్యా సారె ధ్రువీకరించారు.
అంతకుముందే, యెమెన్ నుంచి వచ్చిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం కూడా ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇంతకాలం మౌనంగా ఉన్న హౌతీలు ఇప్పుడు నేరుగా యుద్ధంలోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
తాజాగా రష్యా తన శాటిలైట్ల ద్వారా ఇరాన్‌కు అమెరికా సైనిక కదలికల సమాచారాన్ని అందించడం యుద్ధం అంతర్జాతీయ పోరాటంగా మారుతున్నదనడానికి సంకేతం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలు అత్యంత తీవ్రంగా ఇంధనం, ఎరువులు, మెడిసిన్ కొరత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్వరం శాంతి చర్చలు జరగకపోతే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది.




