28 March, 2026 | 4:19 AM

అరబ్ దేశాలు అతలాకుతలం

28-03-2026 12:56 AM

పచ్చిమాసియా యుద్ధం మొదలై సుమారు నెల కావొస్తున్నది. దీనికి అంతంమెప్పుడనేది యావత్ ప్రపంచాన్నీ తొలుస్తున్న ప్రశ్న. అమెరికా ‘ఆపరేషన్ ఎపి క్ ఫ్యూరీ’, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేర్లతో ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై సంయుక్తంగా దాడులు ప్రారంభించా యి. ఈ క్రమంలో ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమైనితోపాటు ఇతర ముఖ్యమైన నాయకులు, సైనికాధికారులను దారుణంగా హతమార్చాయి.

దీంతో ఇరాన్ ఉగ్రరూపం దాల్చింది. యుద్ధం తీవ్రరూపం దాల్చింది. క్రమంగా చిన్న సైజు ప్రపంచ యుద్ధంగా రూపాంతరం చెందింది. ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్నది. ఆస్తుల ను హరించింది. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెన్, ఒమన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అమెరికాకు సహాయం అందిస్తున్నాయని, ఇరాన్ ఆయా దేశాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నది. అక్కడున్న అమెరికా సైనిక స్థావరాలనే కాకుండా పౌర ప్రాంతాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, నీటి శుద్ధి కేంద్రాలు, పరిపాలన కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నది. 

గల్ఫ్ దేశాలు విలవిల

గల్ఫ్ దేశాలకు చమురు చాలా కీలకం. వాటికి దగ్గరగా ఉండే ఇరాన్, ఇరాక్, సిరి యా, లిబియా లాంటి ముస్లిం దేశాలకు సహజవాయువులే జీవనాడి. ఇరాన్ దాడులను అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నా యి. పశ్చిమ దేశాలు కూడా ఈ దాడులను తప్పుబడుతున్నాయి. తీవ్రమవుతున్న ఈ సంక్షోభాన్ని అరికట్టే మార్గాలను అన్వేషిస్తున్నారు. గల్ఫ్ కో కౌన్సిల్‌కి చెంది న మంత్రులు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఇక్కడ నిత్యం దాడులు జరుగుతున్నాయి. తాము సామూహిక ఆత్మ రక్షణ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఘర్షణల స్థాయిని తగ్గించాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు గల్ఫ్ దేశాలు ఇరాన్‌పై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదు. ఈ దాడుల వల్ల ఆ ప్రాంతాలలో పౌరులకు నష్టం జరుగుతోంది. కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసం అవుతున్నాయి. ఈ కారణాల వల్ల ఆ దేశాలు సైతం ఈ ఘర్షణలో ఇరుక్కోవా ల్సి వస్తుందని బహరేన్ కు చెందిన దేరాసప్ సెంటర్ విశ్లేషించింది. గల్ఫ్ లో జరుగుతు న్న పరిణామాలను ప్రపంచం గమనిస్తోంది. 

చారిత్రక ఒప్పందాలు

1930 మధ్య అమెరికా మధ్య ప్రా చ్య దేశాల వైపు చూసింది. గల్ఫ్ దేశాల మ ధ్య రక్షణ పరమైన వ్యూహాత్మక సంబంధాలు మొదలయ్యాయి. చమురు అన్వేషణ కోసం ఈ దౌత్య బంధం ప్రారంభమైంది. 1945లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూ జ్‌వెల్ట్ ఒక కీలక భేటీ నిర్వహించారు. నాటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్ అజీజ్‌ల మధ్య జరిగిన ఈ భేటీ చారిత్రకమైనది. చమురు భద్రతా ఒప్పందాలతో ఈ బంధం బాగా బలపడింది.

1990 నాటి గల్ఫ్ యుద్ధం ఒక మలుపు అని చెప్పవచ్చు. కువైట్‌పై ఇరాక్ దురాక్రమణ చేసినప్పుడు ‘ఆప రేషన్ డెసర్ట్ స్టార్మ్’ జరిగింది. దీని పర్యావసానంగా సైనిక పరంగా వారు మరింత దగ్గరయ్యారు. గల్ఫ్ దేశాల భద్రతకు అమెరికా పెద్దపీట వేసింది. అక్కడ 8 శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. 11 కీలకమైన ఇతర సైనిక మండలాలను నెలకొ ల్పింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీనివల్ల అమెరికా పై గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) వైఖరిలో మార్పులు వస్తున్నాయి. ఇరాన్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి.

హొర్ముజ్ జల సంధి వద్ద సంక్షోభం తలెత్తకుండా చూడాలని కోరుతున్నాయి. అమెరికాపై ఈ మేరకు అవి ఒత్తిడి తెస్తున్నాయని రాయిటర్స్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. మరో విశ్లేషణ ప్రకారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశా యి. దీని వల్లనే ఇరాన్ గల్ఫ్ పై దాడులు మొదలు పెట్టిందనే వాదన ఉంది. ఈ విషయాన్ని అమెరికా విస్మరిస్తోందని ఆరోప ణలు వస్తున్నాయి. ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలు అమెరికా కల్పించే భద్రతను నమ్ముకున్నాయి. ప్రస్తుత యుద్ధం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేసింది.

ఆలోచనల్లో మార్పు

గల్ఫ్ దేశాల ఆలోచనా విధానం ఇప్పు డు క్రమంగా మారుతోంది. అమెరికాపై ఆధారపడకుండా, తాము సొంత రక్షణ కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఫలితంగా అమెరికా-గల్ఫ్ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టవచ్చు. ప్రస్తుత సంక్షోభం నుంచి నేర్చుకోవాల్సిన అంశాల గురించి మేధావులు చర్చిస్తున్నారు. మార్చి 16వ తేదీన అరబిక్ పాడ్కాస్ట్ ‘ఎహతా’లో ఒక ఆసక్తికర చర్చ జరిగింది. ఇరాన్ గల్ఫ్‌లోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటోంది. దీనివల్ల గల్ఫ్ దేశాల భద్రత బలహీనపడింది.

అక్కడ తమకు ఖర్చుతో కూడుకున్న అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. అయినప్పటికీ తమకు రక్షణ కరువైందని అవి భావిస్తున్నా యి. అమెరికా దుందుడుకు వైఖరి వల్ల తమ కు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. అమెరికా ఉద్రిక్తతలను మరింతగా పెంచుతోంది. ఇరాన్ తమపై నిరంతరాయంగా దాడులు చేస్తూనే ఉంది. అమెరికా ఈ దాడులను తగినంతగా పట్టించుకోవడం లేదు.

ఇది గల్ఫ్ లోని ప్రజలకు అమెరికా చేస్తున్న నమ్మకద్రోహంగా అనిపిస్తోంది. అమెరికా తమను మోసం చేస్తోందనే భావన రేకెత్తుతోంది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా పరిస్థితులు మారవచ్చు. గల్ఫ్ దేశాలు అమెరికా తో ఉన్న సంబంధాలను వదులుకోవడానికి సిద్ధంగా లేవు. 

చమురు సంక్షోభం

యూరోప్ లోని బలమైన దేశాలతో వారు సంబంధాలను చూస్తున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలతో గల్ఫ్ కో కౌన్సిల్‌కు విస్తృత సంబంధాలు ఉన్నాయి. వీటిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అవి భావిస్తున్నాయి. ఈ యుద్ధ సమయంలో తమపై దాడి జరుగుతుంటే ఏ ఒప్పందము పనికిరాకుండా పోయింది. గల్ఫ్ దేశాలే ఇరాన్ పై దాడి చేయాలని అ మెరికాను ప్రేరేపించాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సౌదీ అరేబియా విషయంలో ఇది నిజమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా దాడుల వల్ల అక్కడి ప్రభు త్వం పోతుందని వారు ఆశించారు. ఖోమేని నిరంకుశ ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్యం వస్తుందని భావించారు. కానీ ఈ యుద్ధం ఇరాన్ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చింది. ఇరాన్‌లో కీలకమైన సైనిక నేతలు మృతి చెందారు.

అత్యున్నత నాయకుడు కూడా మరణించారు. అయినప్పటికీ అక్కడ అంతర్యుద్ధము రాలేదు. ప్రభుత్వము పడిపోలేదు. తక్కువ సమయంలోనే ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చు అని అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నాయి. ఆ ఆలోచనలు తుత్తు నియలు అయ్యాయి. ఇక్కడ ఇరాన్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధపడింది. యుద్ధా న్ని మొ దలుపెట్టడం అమెరికా వంతైతే దాన్ని ము గించడం ఇరాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% పైగా హార్మూజ్ జల సంధి ద్వారానే జరుగుతోం ది. ఈ జల సంధిపై ఇరాన్ కు పట్టు ఉంది. చమురు నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణలు విధిస్తోంది. దీనివల్ల ప్రపంచ చము రు అవసరాలకు అంతరా యం కలుగుతోం ది. ఫలితంగా చమురు ధర లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. రోజురోజుకు రవాణా కష్టతరమైపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఇప్పటివరకు 56 ముస్లిం దేశాలలో కేవలం 10 దేశాలు మా త్రమే సంతాపం ప్రకటించాయి. అలీ ఖమెనీ మరణానికి ఆయా దేశాలు స్పందించాయి. మిగిలిన దేశాలు అసలు సంతాపమే ప్రకటించలేదు. గల్ఫ్ దేశాలు ఒక సోదర ము స్లిం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కొందరు విమర్శి స్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు అవి మద్దతిస్తున్నాయని అపవాదు మూట కట్టుకున్నాయి.

ఇరాన్‌పై ప్రతి దాడులతో గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలోకి దిగే ప్రమాదం ఉంది. అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధం నుంచి తప్పుకోవచ్చు. ఈ యుద్ధాన్ని గల్ఫ్ -ఇరాన్ యుద్ధంగా మార్చి చోద్యం చూడవచ్చు. రెండు పక్షాలూ బలహీన పడ్డాక అమెరికా మళ్లీ ముందుకు రావొచ్చు. యుద్ధ నివారణ పేరుతో ఆయుధాలు అమ్మాలని ఆ దేశం భావిస్తోంది.