2 June, 2026 | 12:49 AM

రహదారిపై ‘గుంతల గండం’

02-06-2026 12:14 AM
  1. కనకమామిడి - కావేలిగూడ రోడ్డు గుండా రాకపోకలకు జంకుతున్న జనం 
  2. ఓట్ల కోసం రోడ్డు తవ్వారు.. గెలిచాక గాలికొదిలేశారు
  3. ముంచుకొస్తున్న వర్షాకాలం.. 
  4. మొయినాబాద్ ప్రజల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు

మొయినాబాద్, జూన్ 1(విజయ క్రాంతి): అది నిత్యం వందలాది వాహనాలు తిరిగే ప్రధాన రహదారా? లేక ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్న మృత్యుకూప మా? అనే అనుమానం రాక మానదు అ క్కడి పరిస్థితి చూస్తే.  కనకమామిడి నుంచి వెంకటాపూర్ మీదుగా కావేలిగూడ ఎక్స్రో డ్డు వరకు వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం నరకప్రాయంగా మారింది.

శంషాబాద్ అం తర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఎంతో కీలకమైన ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎన్నిక ల గండం గట్టెక్కేందుకు ఆర్భాటంగా ప్రారంభించిన రోడ్డు పనులు.. ఓట్లు పడగానే అ ర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ఆరు నెలల నరకం.. రాత్రి వేళల్లో ప్రాణాంతకం..

గత ఏడాది డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రోడ్డు నిర్మాణం కోసం రూ. 6.50 కోట్ల నిధులు మంజూరు కాగా..... నేతలు  కొబ్బరికాయలు కొట్టి ఈ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అయితే, కొంత దూరం పనులు చేసి.. రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. గత ఆరు నెలలుగా పనులు అంగుళం కూడా ముందుకు పడకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణం సర్కస్ ఫీట్లను తలపిస్తోంది.

రైతులు, వ్యాపారుల విలవిల..

 ప్రతిరోజూ ఉదయాన్నే కూరగాయల మార్కెట్లకు వెళ్లే రైతులు, వ్యాపారులు, శంషాబాద్ వైపు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు ఈ రోడ్డు దుస్థితి వల్ల నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కనీస రేడియం సూచికలు లేదా హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో, రాత్రి సమయాల్లో ప్రయాణించే వాహనదారులు ఈ గుంతల్లో పడి తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని ఆసుపత్రి పాలయ్యారు.

 వర్షాకాలం ముంచుకొస్తోంది.. అధికారుల్లో చలనం లేదు..

మరో కొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ లోగా రోడ్డు పనులు పూర్తి చేయకపోతే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తవ్విన గుంతల్లో వర్షపు నీరు చేరితే రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో తెలియక మరిన్ని ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు పంచాయతీ, రహదారుల శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ’నేడు.. రేపు’ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన కానీ ప్రభుత్వం నుంచి నిధులు సరైన టైంలో విడుదల కాకపోవడంతోనే  పనులను మధ్యలోనే నిలిపివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే  గారూ.. ఇకనైనా స్పందించాలి..

‘ఓట్ల కోసం పనులు మొదలుపెట్టి.. గెలిచాక మమ్మల్ని గాలికొదిలేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం తగదు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, అలాగే సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. యుద్ధప్రాతిపదికన నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయించి, భవిష్యత్తులో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడాలి‘ అని కనకమామిడి, వెంకటాపూర్, కావేలిగూడ గ్రామస్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.