పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నీలాద్రిపేట గండి, అశ్వాపురంపాడులో ఏర్పాటు చేసిన సోలార్ వీధి దీపాలు ప్రారంభం
కరకగూడెం, మార్చి 13, (విజయక్రాంతి): జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజ్ స్పష్టం చేశారు. కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల వలస గుత్తి కోయ గ్రామాలైన నీలాద్రిపేటగండి, అశ్వాపురం పాడు గ్రామాలలో ప్రజలకు శుక్రవారం నీలాద్రిపేటగండి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ వీధి దీపాలను ఆయన ప్రారంభించారు.
ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారుగా 70 కుటుంబాల నుండి 300 మంది ఆదీవాసీ ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వలస ఆదివాసి ప్రజల సంక్షేమం,అభివృద్ధి కొరకు నిత్యం కృషి చేస్తున్నామని తెలియజేశారు. విద్య,వైద్యం,రవాణా సౌకర్యాలను వారికి కల్పించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ వారికి కూడా మెరుగైన జీవితాన్ని అందించడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నింటిని కూడా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చీరలు,నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. యువతకు టీ-షరట్స్ తో పాటు వాలీబాల్ కిట్లను అందజేశారు. స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు,నోటుబుక్స్ తో పాటు సోలార్ స్టడీ ల్యాంప్స్ ను అందజేశారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి,ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,ఎస్త్స్రలు సురేష్,,పి.వి.ఎన్ రావు,సిబ్బంది పాల్గొన్నారు.




