పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్
- వెలుగుమెట్లలో 2023లో ఇళ్లు కూలగొట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
- మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, వివేక్
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు ఇస్తామని, పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పేటెంట్ అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు బలరాం నాయక్, రామ సహాయం రఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, మాధవరెడ్డితో కలసి మాట్లాడారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... 2023 జూలై 15న వెలుగుమట్లలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టించిందని రుజువులు కూడా చూపించారు. వెలుగుమెట్లలో పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కానీ ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొలగించినట్టు తెలిపారు.
ఈ విషయంలో నిజంగా పేదలపై బీఆర్‌ఎస్ బావ మరుదులు, ఫాంహౌస్‌లో ఉండి కుట్రలు చేస్తున్న కేసీఆర్ వెంటనే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టి ఎనిమిదవ వింతగా ప్రచారం చేసుకుందని ఎద్దేవా చేశారు.
వారి హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడం, అవినీతి కారణంగా బీటలువారడం కూడా జరిగిందని, నాలుగేళ్లలో 168 టీఎంసీల నీరు ఇస్తామని అందులో 50 టీఎంసీల నీటిని సముద్రం పాలుచేశారని మండిపడ్డారు. 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీకి కేసీఆర్, బావ బావమరుదులు వచ్చి మాట్లాడాలని చెప్పా రు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్ట్ల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిం దని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక శ్వేత పత్రం ఇచ్చామని, కాళేశ్వరంపై చర్చించామని, కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకో వాలని కోరామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ. 48 వేల కోట్లు మిత్తీ గా కట్టిందని, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా నిధులు ఇవ్వాలని కోరారు.
మంత్రి వివేక్ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడినందునే దేశంలోని ప్రాంతీయ పార్టీల్లోకెల్లా ధనిక పార్టీగా మారిందని ఆరోపించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయిల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని కేసీఆర్ నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.




