ఒంటరితనాన్ని మర్చిపోయేందుకు అలా చేసేదాన్ని!
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించే మాళవిక మోహనన్ తరచూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. పలు ఆసక్తికర మైన విషయాలను అందరితో పంచుకునేవాళ్లలో ఈ సుందరి ఒకరు. తాజాగా తన వ్యక్తిగత అనుభవాలను వివరిస్తూ మాళవిక పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గత నెల తనకు మిశ్రమ అనుభూతులను అందించిందంటూ మార్చి నెలలో తనకు ఎదురైన అనుభవాలను మాళవిక అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఒంటరితనం వల్ల ఎంతో బాధ పడ్డానని, ఆ ఫీలింగ్ నుంచి బయటపడేందుకు ఏం చేసేదో కూడా వివరించింది. “గత నెల నాకెన్నో అనుభూతులు అందించింది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో ‘పాకెట్ నవల్’ కోసం పనిచేయడం. అత్యుత్తమ దర్శకుల్లో ఆయన ఒకరని నిస్సందేహంగా చెప్పగలను. ఆయన మూవీ మేకింగ్ స్టైల్‌ను గమనించడం.. ఆయన మార్గదర్శకత్వంలో నటిగా నన్ను నేను మలుచుకో వడం.. కెరీర్ పరంగా అదొక అద్భుతమైన సృజనాత్మక అనుభవం. షూటింగ్‌లో భాగంగా నెలలో చాలా రోజులు చెన్నైలోనే గడిపా. పని మంచిగానే ఉన్నప్పటికీ ఇంటికి అంతకాలం దూరంగా ఉండటం ఊహించిన దానికంటే ఎక్కువగా కుంగదీసింది. రోజంతా కష్టపడి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఒక్కదాన్నే ఉన్నాననే ఫీలింగ్ అంత సులభంగా తీసుకోలేకపోయా. ఆ భావన నుంచి బయటకు వచ్చేందుకు సాయంత్రం వేళల్లో పడవ ప్రయాణానికి వెళ్లేదానిని. నా కుటుంబసభ్యులు నన్ను చూడటానికి చెన్నై వచ్చినప్పుడు నాకెంతో ఉపశమనంగా అనిపించింది. చెన్నై, మహాబలిపురంలోని దేవాలయాలను సందర్శించా. ఇష్టమైన భోజనం చేశా. హాయిగా సమయాన్ని ఆస్వాదించా. కొన్ని రోజుల క్రితమే ముంబయికి తిరిగివచ్చా” అని మాళవిక రాసుకొచ్చారు.




