26 May, 2026 | 1:56 AM

గాలివాన బీభత్సం

26-05-2026 12:55 AM
  1. పలు జిల్లాల్లో అకాల వర్షం
  2. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  3. నేలకొరిగిన చెట్లు.. విరిగిపడ్డ స్తంభాలు 
  4. విద్యుత్ సరఫరాలో అంతరాయం 

కరీంనగర్/కామారెడ్డి/జహీరాబాద్/బెజ్జంకి/తూప్రాన్/షాద్‌నగర్/ఘట్‌కేసర్, మే 25: రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు జిల్లాల్లో అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం తడిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో వాన బీభత్సం సృష్టించింది.

వానకు తోడు గాలి కావడంతో దాదాపు 40 నిమిషాల పాటు మండలంలోని మేదపల్లి, ఝరాసంగం, కుప్పానగర్ గ్రామాలలో విపరీతమైన గాలి వీయడంతో ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. ఝరాసంగం తహసిల్దార్ కార్యాలయం ముందు ఆపి ఉంచిన కారుపై పక్కనే ఉన్న చెట్టు గాలికి పడడంతో కారు ధ్వంసం అయింది. డీసీసీ బ్యాంక్ ముందు గల చెట్లు కరెంటు తీగలపై పడడంతో కరెంటు తీగలు తెగిపడ్డాయి. మేధాపల్లిలోని ఓ బీద కుటుంబీకుని ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరి కింద పడడంతో వారు బిక్కుబిక్కుమంటున్నారు.

కుప్పనగర్ లోని పలు ఇండ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాలలో గల చెట్లు నేలకొరిగాయి. బొంపల్లి, బోడగామా, జీలకర్రపల్లి, బర్దిపూర్ గ్రామాలలో విపరీతమైన గాలి విడిచినప్పటికీ ఒక మోస్తారు వర్షం కురిసింది. మాస్నూర్ నుండి ఈదులపల్లి వెళ్లే కరెంటు స్తంభాలు గాలికి నేలకొరవడంతో విద్యుత్ అంతరం ఏర్పడినట్లు సమాచారం ఉంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది.

గాలివాన బీభత్సానికి సర్కిల్లోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కొమ్మలు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కాల్లిపెల్లి, గూడెం గ్రామాల్లో చెట్లు, కరెంట్ పోల్స్ విరిగి రోడ్లపై పడిపోయాయి. 

రైతన్నల కొంపముంచిన వర్షం 

కామారెడ్డి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం అకాల వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత 45 రోజులుగా ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం రాశులను పెట్టుకొని నిరీక్షించగా అకాల వర్షంతో  ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మాచారెడ్డి, రామారెడ్డి, తాడువాయి, లింగంపేట్, ఎల్లారెడ్డి, రాజంపేట, బిక్కనూర్ మండలాల్లోని కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, గుంటపల్లి చెరువు తండా, రాజన్నపేట గ్రామాలలో ఈదురు గాలుల వానకు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యపు సంచులు తడిసిపోయాయి. పిడుగుపాటుకు కోడె మృతి చెందగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లా  బెజ్జంకి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామంలో రోడ్లపై వరి ధాన్యం కుప్పలు పూర్తిగా వర్షం తాకిడికి తడిసి పోయాయి.

ఐకెపి సెంటర్ లోకి వర్షం నీరు వచ్చి చేరడంతో వరి ధాన్యం కుప్పలు తడిశాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్, మహేశ్వరం నియోజకవర్గంలో ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ నష్టం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలం చిలకమర్రి గ్రామంలో ఒకే రైతుకు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో కాయలన్నీ నేలరాలాయి. ఎన్జీవోస్ కాలనీలో భారీ వృక్షాలు కూలిపడ్డాయి.