15 June, 2026 | 1:29 AM

ఉచిత ఇసుక ఉత్తమాటే..

15-06-2026 12:19 AM

ఇసుక మాఫియాకు ఇందిరమ్మ ఇండ్లు వరం..

లబ్దిదారుల ఇసుక మరొకరికి అమ్ముతున్న వైనం..

బిచ్కుంద జూన్ 14 (విజయక్రాంతి): తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తున్నప్పటికీ, అక్రమ రవాణా దారులు (ఇసుక మాఫియా) మరియు కొందరు అధికారులు లబ్ధిదారుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం ఒక్కో ఇంటికి 40 టన్నుల అంటే దాదాపు 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా కేటాయిస్తోంది. లబ్ధిదారులు ఇసుక రీచ్ల వద్ద ఇసుకకు ఎలాంటి ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇసుకను తరలించే ట్రాక్టర్ కి రవాణా ఛార్జీలు మాత్రమే భరించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మాఫియా ట్రాక్టర్కు రూ. 1000 నుండి రూ. 1,500 వరకు అదనంగా వసూలు చేస్తోంది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆన్లైన్ చేసిన అప్రూవల్ పత్రాలు పొంది ఇసుకను తరలించుకోవాలి. కాగా లబ్ధిదారులకు ఉచితంగా అందాల్సిన ఇసుకను కొందరు అక్రమార్కులు ముందే బుక్ చేసి, రహస్య ప్రాంతాల్లో భారీగా నిల్వ చేసి అర్ధరాత్రివేళ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అంతేగాకుండా ఇందిరమ్మ నిర్మాణాలకు ఆన్లైన్ చేసిన ఇసుకను కొందరు అక్రమార్కులు ప్రైవేటుగా అమ్ముకొని ధనార్జనే ధ్యేయంగా ఇందిరమ్మ ఇండ్లు వారికి వరంగా మారాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందువల్ల లబ్దిదారులు అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇసుక సరఫరాపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తెలుసుకోవడానికి తమ ప్రాంతంలో ఉచిత ఇసుక కోసం తహసీల్దార్ కార్యాలయం వెళ్లాలి. ఇసుక రవాణాలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే,  స్థానిక రెవెన్యూ లేదా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.