16 July, 2026 | 10:23 PM

గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసింది

03-07-2024 03:15 AM
  • పల్లెలను గాలికొదిలేసిన కాంగ్రెస్: హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పరిశుభ్రంగా ఉంచాల్సిన పల్లెలను గాలికి వదిలేశా రని ఆరోపించారు. మంగళవారం తెలంగా ణా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పడు గ్రామపంచాయతీల్లో  చెత్త సేకరణకు కేవలం 87 ట్రాక్టర్లు ఉండేవని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 12,769 పంచాయతీల్లో 12,769 ట్రాకర్లు సమకూర్చి చరిత్ర సృష్టించిందని చెప్పారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులు రాలేదని గుర్తుచేశారు. 

కానీ కాంగ్రెస్ పాలనలో నిధులు లేక గ్రామ పంచాయతీలు కూనరిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఉందని, మురికి కూపాలుగా మారాతున్నాయని అన్నారు. డీజిల్ పోయించుకునే పరిస్థితి లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయని, కొన్ని గ్రామాల్లో సెక్రటరీలు అప్పులు చేసి డీజిల్ పోయిస్తున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో పలువురు అధికారులతో మాట్లాడితే కరెంటు బిల్లు కట్టేందుకు పంచాయతీల్లో డబ్బులు లేవని, పైఅధికారులు బెదిరింపులతో తామే డీజిల్ పోయించడం, బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారని అన్నారు.

కేసీఆర్ పాలనలో కరెంటు బిల్లులు సమయానికి చెల్లించేవారని, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారని స్పష్టంచేశారు. ప్రతి నెలా రూ. 275 కోట్లు, ఏటా రూ.3,330 కోట్లు పల్లెలో అభివృద్ధి కోసం ఇచ్చామని ఉద్ఘాటించారు. పట్టణాలకు ఏటా రూ.1700 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.  

ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా నిధులు కేటాయించాలి 

పంచాయతీల్లో నిధులు లేక చెత్త పేరుకపోయిందని, స్పెషల్ డ్రైవ్ లేదు, ప్రభుత్వం గొప్పలు చెప్తోందని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. ప్రజా ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికు లకు స్థానం లేదా ? ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. అంటురోగాల బారిన పడితే ఎలా? పల్లెల మీద సమీక్ష ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు. చివరకు సర్పంచులు పోయి గవర్నర్ కు మొర పెట్టుకునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వంలో వేతనాలు అందక కార్మికుల ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఎంపిటీసీ, జెడ్పీటిసీలకు పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులను నిలువునా ముంచి సంక్షేమానికి సమాధి కట్టారని, ఆంక్షలు తప్ప పింఛన్లు లేవని, చంద్రబాబు బకాయిలతో రూ.4వేలు పింఛన్ ఇస్తే, ఇక్కడ ఇచ్చేవి ఇవ్వడంలేదు, పెంచడం లేదన్నారు. రెండు నెలల ఆసరా పింఛన్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పి రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగాడని ఆరోపించారు. ఆయన ఆత్మహత్య బాధకరమన్నారు.

రాష్ట్ర విభజన సమస్యల మీద లేఖ రాయ డం హర్షనీయమని, ఏడు మండలాలను లోయర్ సీలేర్ ఏపీలో కలిపారని, కేసీఆర్ తీవ్రంగా స్పందించినా.. బీజేపీ బిల్లు పెడితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబు మీద ఒత్తిడి చేసి ఏడు మండలాలను లోయర్ సీలేర్ మనకు వచ్చేలా చేయా లని, తరువాత విభజన హామీల గురించి మాట్లాడాలని సూచించారు.