25 April, 2026 | 2:27 AM

పాలనకు జీవనాడి రెవెన్యూ శాఖ

25-04-2026 12:00 AM

రమేష్ పాక :

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి ఎన్నో శాఖలు ఉన్నా, ప్రజలతో ఎక్కువగా ప్రత్యక్ష సంబంధం కలిగి, ప్రభుత్వ ఉనికిని నేలమీద ప్రతిఫలింపజేసే శాఖ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ శాఖే. ఈ శాఖను కేవలం భూముల పరిపాలనకు పరిమితమైన యంత్రాంగంగా చూడటం దాని అసలైన పరిధిని, ప్రాముఖ్యతను అణగదొక్కినట్లే అవుతుంది.

వాస్తవానికి రెవెన్యూ శాఖ రాష్ట్ర పరిపాలనా నిర్మాణానికి వెన్నెముక మాత్రమే కాదు, అది ప్రభుత్వ కార్యాచరణకు క్షేత్రస్థాయి జీవనాడి కూడా. గ్రామ సరిహద్దు నుంచి రాష్ట్ర రాజధాని వరకు విస్తరించిన పరిపాలనా శ్రేణి లో ప్రభుత్వానికి కళ్లూ, చెవులూ, చేతులూ అన్నీ ఈ శాఖే. ప్రజలు ప్రభుత్వాన్ని మొదటగా స్పృ శించే స్థలం తహసీల్దార్ కార్యాలయం; జిల్లా పరిపాలనను క్షేత్రస్థాయిలో న డిపించే ప్రధాన శక్తి కలెక్టరేట్; ఈ రెండింటి వెనుక నిలిచేది రెవెన్యూ యంత్రాంగమే.

ప్రభుత్వ యంత్రాం గం ప్రజల గడప దాటే మార్గం ఇదే. పౌరుడి జీవితం ప్రభుత్వ వ్యవస్థతో అనుసంధానమ య్యే ప్రతి దశలో రెవెన్యూ శాఖ ఉంటుంది. పుట్టుక నమోదులో, మరణ ధ్రువీకరణలో, కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువపత్రాల జారీలో, వారసత్వ హక్కుల నిర్ధారణలోనూ ఈ శాఖ పాత్ర అనివార్యం. విద్య, ఉద్యో గం, సంక్షేమ పథకం, రిజర్వేషన్, రుణం, ప్రతి అవకాశానికి అవసరమైన ప్రాథమిక ధ్రువీకరణను అందించే బాధ్యత ఈ శాఖదే.

అందువల్ల రెవెన్యూ శాఖ ప్రజలకు సేవలందించే శాఖ మాత్రమే కాదు; పౌర హక్కులకు పరిపాలనా ద్వారం కూడా. భారతీయ సమాజం లో భూమి కేవలం ఆస్తి కాదు, ఆర్థిక స్థిరత్వానికి ఆధారం, కుటుంబ గౌరవానికి ప్రతీక, అనేక కుటుంబాల జీవనాధారం. అలాంటి భూమికి సం బంధించిన రికార్డుల నిర్వహణ, మ్యూ టేషన్లు, సర్వేలు, సరిహద్దుల నిర్ధారణ, వివాదాల పరిష్కారం, ప్రభుత్వ భూ ముల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు, భూస్వాధీనం వంటి అత్యంత సున్నితమైన వ్యవహారాలన్నీ ఈ శాఖ పరిధిలోనే ఉంటాయి.

భూమి వ్యవహారా ల్లో ఈ శాఖ తీసుకునే నిర్ణయాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రభావాలను కలిగించేంత కీలకమైనవి. సంక్షేమ రాష్ట్రంగా ప్రభుత్వ పాత్ర విస్తరించిన నేటి కాలంలో రెవె న్యూ శాఖ ప్రాధాన్యం మరింత పెరిగింది. పింఛన్లు, రైతు పథకాలు, ఉపశమన ప్యాకేజీలు, విపత్తు పరిహారం, పేదల గుర్తింపు, లబ్ధిదారుల ధ్రు వీకరణ ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో రెవెన్యూ యంత్రాంగమే కీలకం. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికల నిర్వహణలోనూ ఈ శాఖ పాత్ర అపారమైనది.

అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలు, సహకార సంఘాలు, ఏ ఎన్నికైనా క్షేత్రస్థాయిలో నిర్వహించేది రెవెన్యూ శాఖే. ఓటరు జాబితా సవరణల నుంచి పోలింగ్ వరకు ఈ శాఖ అత్యంత బాధ్యతతో పనిచేస్తుంది. విపత్తుల సమయంలో ప్రజలకు ముందుగా కనిపించే ప్రభుత్వ ఆపన్నహస్తం కూడా రెవెన్యూ శాఖదే. వరదలు, అగ్నిప్రమాదాలు, కరువు, మహమ్మారి, రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ యంత్రాంగం 24 గంటలూ ప్రజల మధ్యే ఉంటుంది.

నష్టం అంచ నా నుంచి పరిహారం పంపిణీ వరకు, పునరావాసం నుంచి పునర్నిర్మాణం వరకు ప్రభుత్వ స్పందనకు క్షేత్రరూపం ఇదే. సంక్షోభ కాలంలో ప్రభుత్వ మానవత్వాన్ని ప్రజలు అనుభవించేది ఈ శాఖ ద్వారానే. ఇదంతా సరిపోనట్లుగా, అవసరమైన సందర్భాల్లో మేజిస్ట్రియల్ అధికారాలతో శాంతిభద్రతల పరిరక్షణలోనూ ఈ శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. నిషేధాజ్ఞలు, శాంతిభద్రత చర్యలు, ప్రజా నియంత్రణ, అత్యవసర పరిపాలన వంటి అంశాల్లో రెవెన్యూ అధికారులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు.

పరిపాలన, భద్రత, ప్రజా సేవ మూడింటినీ ఏకకాలంలో మోసే అరుదైన శాఖ ఇదే. రాష్ట్ర పరిపాలనను సమగ్రంగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది, రెవెన్యూ శాఖ లేకుండా జిల్లా పరిపాలన నిలవదు; జిల్లా పరిపాలన బలహీనమైతే ప్రభుత్వ ప్రభావం ప్రజల జీవితాల్లో కనిపించదు. అందుకే రెవెన్యూ శాఖను కేవలం ఒక శాఖగా కాకుండా, ప్రభుత్వ కార్యాచరణకు కేంద్ర అక్షంగా పరిగణించాలి. నేటి వేగవంతమైన పాలనా వ్యవస్థలో ఈ శాఖ బాధ్యతలు మరింతగా పెరుగుతున్న వేళ, దానికి తగిన గుర్తింపు, వనరులు, సాంకేతిక వనరులు, మానవ వనరుల బలోపేతం అత్యవసరం.

 వ్యాసకర్త: రాష్ట్ర తహసీల్దార్ల అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ