06-12-2025 04:39:13 PM
హోంగార్డ్ అధికారుల పనితీరు ప్రశంసనీయం
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకల సందర్బంగా హోంగార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ ముఖ్య అతిథులుగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, హోంగార్డులు పోలీస్ శాఖలో అంతర్గత భాగమని,పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని,ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.
హోమ్ గార్డ్స్ అధికారులు,సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని, రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, హోమ్ గార్డ్ సిబ్బంది ప్రతి డ్యూటీని బాధ్యతగా నిర్వహించే వారి క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు.విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు, మెమోంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, నాగేశ్వరరావు, రవి, ఆర్.ఐ లు మధుకర్, యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.