12-08-2025 12:05:03 AM
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ జర్నల్‌లో పరిశోధనా వ్యాసం
పటాన్ చెరు, ఆగస్టు 11 : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం (ఈఈసీఈ) అధ్యాపకులు వి. శివప్రసాద్, ప్రొఫె సర్ కె. మంజునాథాచారి సంయుక్తంగా రచించిన పరిశోధనా వ్యాసం ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ యొక్క పీర్-రివ్యూడ్ జర్నల్- ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మైక్రోవేవ్ అండ్ వైర్ లెస్ టెక్నాలజీలో ప్రచురితమైనట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
‘ట్రిపుల్ బ్యాండ్ సర్క్యులర్ క్వార్టర్ మోడ్ సబ్ స్ట్రేట్ ఇంటిగ్రేటెడ్ వేవ్ గైడ్ (క్యూఎమ్‌ఎస్‌ఐడబ్ల్యూ) 1స2 ఎమ్‌ఐఎమ్‌ఓ యాంటెన్నా రూపకల్పన, విశ్లేషణ’ పేరిట వారు వెలువరించిన పరిశోధనా వ్యాసం ఈ ఘనత దక్కించుకున్నట్టు తెలియజేశారు. గీతం, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ మధ్య ట్రాన్స్ ఫార్మేటివ్ ఒప్పందం కింద శివప్రసాద్ తొలిసారి వంద శాతం వ్యాస ప్రచురణ రుసుము (ఆర్టికల్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏపీసీ) మినహాయింపును పొందినట్టు వివరించారు.
ఈ పరిశోధనా పత్రం గోల్ ఓపెన్ యాక్సెస్ కింద ప్రచురితమైనందున, ప్రపంచ వ్యాప్త పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. విశ్వ యవనికపై గీతం బావుటా ఎగురవేసిన ఈ ఇద్దరు అధ్యాపకులను గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవి, పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, సిబ్బంది అభినందించినట్టు ఆ ప్రకటనలోపేర్కొన్నారు.