సైకిల్ ట్రాక్ ఏదీ?
1.20 కోట్లతో హనుమకొండలో నిర్మాణం
దానిపైనే నిర్మాణాలు.. ఆక్రమణలు!
వరంగల్, జూన్ 8 (విజయక్రాంతి): స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో రూ.1.20 కోట్ల ఖర్చుతో హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఫాతిమా నగర్ జంక్షన్ వరకు 4 కిలో మీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకంగా నిర్మించిన సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి.
సైకిల్ వినియోగం పెంపొందించడానికి ఇరువైపులా 2 రెండు మీటర్ల వెడల్పుతో 4 కిలోమీటర్ల వరకు సైకిల్ ట్రాక్, ప్రత్యేక రేడియం పెయింట్ (మార్కింగ్) వేయించి, ట్రాక్ లోకి ఇతర వాహనాలు ప్రవేశించకుండా పోల్స్ నాటించారు. పాదచారులు నడచిచే విధంగా ప్రత్యేకంగా ఫుట్ పాత్ నిర్మించారు. అలాగే పచ్చదనం కోసం మొక్కలు నాటారు. ల్యాండ్ స్కేపింగ్, సైక్లింగ్‌ను ప్రోత్సహించే విధంగా సూచిక బోర్డులు, ఫుట్ పాత్‌పై అనేక చోట్ల సేదతీరే విధంగా బెంచీలు, పాత కాలం తరహా ప్రత్యేక వీధి లైట్లను ఏర్పాటు చేశారు.
మొదట్లో సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ సుందరంగా కనిపించినా.. రానురాను రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ అనేకచోట్ల ఆక్రమణకు గురికావడం, తర్వాత సైకిల్ ట్రాక్‌పై మొక్కలు పెంచడానికి పలు చోట్ల గోతులు తీయడంతో స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయింది.
కేవలం ఎన్‌ఐటీ వద్ద మాత్రమే అర కిలోమీటర్ మేర సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ ఉపయోగించే పరిస్థితిలో ఉండగా, మిగిలిన మూడున్నర కిలోమీటర్లు సైకిల్ ట్రాక్ కిల్ అయి, ఫుట్ పాత్ కూడా ఆక్రమణల మాటున కనిపించకుండా పోయింది. ఫుట్ పాత్ లపై ఆక్రమణలు, సైకిల్ ట్రాక్ పోల్స్ తొలగించి రోడ్డుగా వినియోగించడం వల్ల కోటి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ ఎందుకూ పనికిరాకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హనుమకొండ కలెక్టరేట్ నుండి ఫాతిమా జంక్షన్ వరకు నాలుగు కిలోమీటర్ల మీద ఏర్పాటుచేసిన సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ 3.5 కిలోమీటర్లు నిరుపయోగంగా మారగా, జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్‌ఐటి) ఆధీనంలో ఉన్న అర కిలోమీటర్ దూరం మాత్రం ఆక్రమణలకు గురికాకుండా ఆదర్శంగా నిలిచింది.
రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్, బెంచీలు, వీధిలైట్లు చెక్కుచెదరకుండా ఉండగా, నాటిన మొక్కలు కూడా వృక్షాలుగా ఎదిగి సుందరవణంగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల వ్యాపార సంస్థల ఎదుట ఉన్న సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ అనేక చోట్ల ధ్వంసం చేసి పాదా చారులు, సైకిల్ లిస్టులు ప్రయాణించకుండా అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేపట్టినా, మున్సిపల్, ట్రాఫిక్ పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.






