గ్రామీణులకు జీవనాధారం ‘ఉపాధి’
కొత్త చట్టంతో జరిగే నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు
ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి సీతక్క
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): కొత్త చట్టంతో గ్రామీణ పేదల ఉపాధి, జీవనోపాధి ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగ కుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణలో లక్షలాది గ్రామీణ కుటుం బాలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా మారిందని, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు.
జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ- రామ్‌జీ చట్టం అమలులోకి వచ్చే నేపథ్యంలో సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క ఉన్నతా ధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే, కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్లలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాల్సి ఉండటం, రాష్ట్రాలకు ముందుగా నిర్ణయించిన నిర్నిత నిధుల కేటాయింపు విధానం అమలు చేయడం, కేంద్ర రాష్ట్ర వ్యయ భాగస్వామ్యాన్ని 60:40 నిష్పత్తికి మార్చడం వంటి అంశాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు.
రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం, కేంద్రం నిర్ణయించే నార్మేటివ్ కేటాయింపులకు మించి అవసరమయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభు త్వం భరించే అవకాశాలు, కేంద్ర రాష్ట్ర నిధుల భాగస్వామ్య విధానంలో మార్పులు కోరడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ‘గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఉపాధి హక్కును కాపాడటం మా కర్తవ్యం. కొత్త చట్టం అమలుతో తెలంగాణ కార్మికులు, రైతులు, గ్రామీణ కుటుంబాలు నష్టపోకుండా ఉండేలా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తు న్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీతక్క చెప్పారు.
నేడు మహిళా శక్తి మహా సభ
రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘా ల మహిళలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహిస్తున్న మహా మహిళా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది మహిళలు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై సీఎం ప్రకటన చేయనున్నారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చిన 553 బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క సోమ వారం సాయంత్రం పరిశీలించారు. శాఖలు సమన్వయంతో పనిచేసి సభ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
బడుల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
15నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సోమవారం మంత్రి సీతక్క హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.






