ఉద్యాన పంటల సబ్సిడీ రూ.133 కోట్లు
విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడితో ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు, ఉద్యాన పంటలలో సూక్ష్మసేద్యం కోసం రాయితీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 2023 సంవత్సరానికి 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి తీసుకొచ్చినట్లు, ఇందుకు కేంద్రం నుంచి రూ.80.10 కోట్లు రాయితీ కింద విడుదలైనట్లు తెలిపారు. వాటికి రూ. 53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తం రూ. 133.50 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
ఈఏడాదిలో కేవలం రూ. 32.72 కోట్లు మాత్రమే విడుదల చేయగా, వివిధ కారణాలతో రూ. 100.76 కోట్లు పెండింగ్‌లో పెట్టినట్లు, దీంతో ఉద్యాన శాఖ రైతులుకు ఆయిల్‌పామ్, డ్రిప్ కంపెనీలకు సకాలంలో బకాయిలు విడుదల చేయడం వీలు పడలేదన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఆయిల్ పామ్ రైతులకు, కంపెనీల ఇబ్బందులు తీసుకెళ్లడంతో పెండింగ్‌లో ఉన్న రూ. 100.76 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రెండు మూడు రోజుల్లో అయిల్ పామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగుకు సంబంధించిన రాయితీలను, రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఉద్యానశాఖ చర్యలు తీసుకుందన్నారు. అదే విధంగా 2022 సంవత్సరం నుండి విడుదల కావాల్సిన సూక్ష్మ సేద్యానికి సంబంధించి రూ. 55.36 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు.






