22 May, 2026 | 10:37 AM

‘నీట్’ను రద్దు చేయాలి

19-06-2024 12:04 AM

నిర్వహణ బాధ్యతలు రాష్ట్రాలకే అప్పగించాలి 

మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి) ః  నీట్ పరీక్షతో తెలంగాణ వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు, కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు.  కొప్పుల ఈశ్వర్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, రూప్‌సింగ్‌తో కలిసి మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా ఎదుట నీట్ పరీక్ష విధానంపై మండిపడ్డారు. నీట్‌పై వస్తున్న ఆరోపణలపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి చాలా మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారని, 2015 నుంచి పరీక్ష రాస్తున్నారని పేర్కొన్నారు.

15 శాతం మాత్రమే ఆలిండియా కోటాకు పోతున్నారని, నీట్ పరీక్షలో సీటు వచ్చిన వేరే రాష్ట్రాలకు  మన పిల్లలు పోవడం లేదన్నారు. రాష్ట్రంలో 30 వైద్య పిజీ కళాళాలలుండగా వాటిలో ప్రభుత్వ పీజీ కళాశాలలు 10 ఉన్నాయని, వీటిలో 2978 సీట్లు ఉండగా ప్రభుత్వ సీట్లు 1267 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో ప్రభుత్వ కళాశాల్లో 50శాతం సీట్లు ఆలిండియా కోటాకు వర్తిస్తాయని, ఈకోటాతో రాష్ట్ర విద్యార్థులు 621 సీట్లు కోల్పోతున్నారని తెలిపారు.  అదేవిధంగా 54 వైద్య కళాశాలలుండగా వీటిలో 15 శాతం సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్లడంతో  519 సీట్లు కోల్పోతున్నామన్నారు.

2017లో కేంద్రం ప్రారంభించిన నీట్ విధానంతో ఇతర రాష్ట్రాలతో పొల్చితే  ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదన్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని లక్షలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు.  విద్యార్థుల బతుకులు ఆగమవుతున్నా కోర్టులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, కౌన్సెలింగ్ అయిపోయిన తరువాత చేసేదేమి ఉండదని, అందుకే ఈ పరీక్షను వెంటనే రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.   వైద్య విద్య ప్రవేశాలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలని ప్రభుత్వానికి సూచించారు.