కేజీవీబీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
తిరుమలాయపాలెం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో తిరుమలాయపాలెం మండలంలోని కేజీవీబీ, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
202526 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆరు సబ్జెక్టులపై వార్షిక పరీక్షలు నిర్వహించగా విద్యార్థులకు సమగ్రంగా సిద్ధం అయ్యేలా సమయం కల్పించారు. మండలంలోని నాలుగు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 591 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 554 మంది ఉత్తీర్ణత సాధించారు. జల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మేకల జ్ఞానేశ్వరి 581 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానం జిల్లాలో రెండో స్థానం సాధించింది.
పిండిప్రోలు ప్రభుత్వ పాఠశాలకు చెందిన బోడ భరత్ 577 మార్కులతో మండల ద్వితీయ స్థానంలో నిలిచాడు. తేట్టెలపాడు, మాదిరిపురం పాఠశాలలు శాతం వంద ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు నామవరపు బాబు, దారా రాజేష్, విజయకుమారి, కే రమకుమారి, వీరస్వామి, మధుసూదన్, గోపాలరావు, కృష్ణమోహన్, సీతారాంరెడ్డి అభినందించారు.






